Andhra News: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం

రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది.

Published : 03 Jul 2024 05:13 IST

రాజకీయ సిఫార్సు బదిలీలకు పడనున్న అడ్డుకట్ట
సాధారణ ఉపాధ్యాయులకూ న్యాయం జరిగేలా చట్టం
14 రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు
ఈనాడు - అమరావతి

రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. సాధారణ ఉపాధ్యాయులకూ న్యాయం జరిగేలా దీన్ని తీసుకురాబోతున్నారు. 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారడంతో మూలకు పడేశారు. ఇప్పుడు లోకేశ్‌ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడైనా ఈ చట్టాన్ని తొందరగా తీసుకురావాలి. 

ఉపాధ్యాయుల అభిప్రాయాలతో..

బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ 14 రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాలు టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా.. మరికొన్ని ప్రత్యేక పాలసీలను అమలుచేస్తున్నాయి. అస్సాం, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక చట్టాలను రూపొందించగా.. బిహార్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపుర్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి ప్రత్యేక పాలసీలను అనుసరిస్తున్నాయి. వీటిన్నింటినీ అధ్యయనం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోనుంది.

కర్ణాటకలో అందరికీ అన్ని కేటగిరీలు

కర్ణాటకలో మూడు కేటగిరీల విధానం ఉంది. ఎక్కువ రాష్ట్రాలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేశాకే బదిలీలు చేపడుతున్నాయి. కర్ణాటక విధానం ప్రకారం మొదటిసారి విధుల్లో చేరే ఉపాధ్యాయుడు, మొదటిసారి పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు జోన్‌-సీలో చేరాలి. అక్కడ ఖాళీలు లేకపోతే పదోన్నతి లభించే ఉపాధ్యాయులను బదిలీచేసి, అక్కడ వచ్చే ఖాళీలను భర్తీచేస్తారు. సర్వీసు ఆధారంగా ఒక్కో జోన్‌ మారుతూ ఉంటుంది. జోన్‌-ఏలో పదేళ్లకు పైగా పనిచేసిన ఉపాధ్యాయులను జోన్‌-బీ, సీలకు బదిలీ చేస్తారు. ఏడాది విడిచి ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలల్లో బదిలీలు చేస్తున్నారు. మూడేళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ విధానం ఉంది. 

  • అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రత్యేక విధానం ఉంది. ప్రతి ఏటా డిసెంబరులో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తున్నారు. జనవరి 1-15 వరకు ఖాళీలను గుర్తిస్తారు. మే 1-15 వరకు కౌన్సెలింగ్‌కు ఐచ్ఛికాలు తీసుకుని, మే 16-31 మధ్య బదిలీ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయితే బదిలీ తప్పనిసరి.
  • హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి 15లోపు బదిలీలు చేస్తారు. ఐదేళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ ఉంటుంది. మణిపూర్‌లో విద్యాసంవత్సరం ముగిశాక బదిలీలు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు మూడేళ్లు, కేటగిరి-సీలో రెండేళ్లు, కేటగిరి ఏ, బీలలో మూడేళ్లు పూర్తి చేసుకున్నవారికి తప్పనిసరి బదిలీ విధానం ఉంది.
  • పంజాబ్‌లో డిసెంబరులో హేతుబద్ధీకరణ, జనవరిలో ఖాళీల ప్రకటన, ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి రెండో వారంలోపు బదిలీలు పూర్తిచేసి, ఆర్డర్లు ఇస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఉద్యోగం చేరినవారు మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకుంటే తప్పనిసరి బదిలీలకు అర్హులుగా పరిగణిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని