AP news: ఇంటింటా నైపుణ్య గణన

జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది.

Published : 29 Jun 2024 06:43 IST

ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ప్రతి ఒక్కరి విద్యార్హతలు, నైపుణ్య వివరాల సేకరణ
కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో సర్వేకు కసరత్తు

ఈనాడు, అమరావతి: జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. నిరుద్యోగులు ఏం చదువుకున్నారు? ఏ పని చేస్తున్నారు? వారి నైపుణ్యాలేంటి? అన్న వివరాలను నమోదు చేయనున్నారు. ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్‌లైన్‌లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వివరాలను ఆధార్‌తో అనుసంధానిస్తారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ రూపొందించనున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్దనున్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల వరకు నిరుద్యోగులున్నారు. యాప్‌ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు. ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్‌లా శాశ్వత నంబరు కేటాయించడంపైనా ఆలోచిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు గుర్తించనున్నారు. 

పరిశ్రమల అవసరాలు గుర్తింపు

ఇంటింటి సర్వే పూర్తయ్యాక కంపెనీలు, పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో గుర్తిస్తారు. నిరుద్యోగులకున్న నైపుణ్యాలు, పరిశ్రమల అవసరాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణనిస్తారు. ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి?లాంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు ఏదో ఒక సబ్జెక్టు, సాంకేతికతపైనే శిక్షణను ఇస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం వద్ద పూర్తిస్థాయి సమాచారం లేదు. ఇప్పుడు పూర్తి డేటా సేకరణ దిశలో అడుగులేస్తున్నారు. నైపుణ్య శిక్షణకు కేంద్రంలోని సెక్టార్‌స్కిల్‌ కౌన్సిలర్లను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ సెక్టార్, వ్యవసాయం, బ్యూటీ-వెల్‌నెస్, ఇంటి పనివాళ్లు, ఆహార పరిశ్రమ సామర్థ్యం, ఫర్నీచర్‌-ఫిట్టింగ్, పవర్‌ సెక్టార్‌లాంటి అన్ని రంగాల్లోనూ నైపుణ్య శిక్షణకు సంబంధించిన మెటీరియల్‌ కేంద్ర సెక్టార్‌ స్కిల్‌ మండళ్ల వద్ద ఉంది. నైపుణ్య అంతరాల ఆధారంగానే ఈ కౌన్సిళ్లు శిక్షణ విధానాన్ని రూపొందించింది. 

రాష్ట్రవ్యాప్తంగా సర్వేకోసం ఇంటింటి వివరాల సేకరణకు మూడు నెలలు పట్టొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సర్వే పూర్తయ్యాక విశ్లేషణ ఆధారంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రణాళికలను రూపొందిస్తారు. ఆ మేరకు విద్యార్థులకు విద్యాసంస్థల్లోనే నైపుణ్యాలు అందించనున్నారు. ఇందుకోసం బీటెక్, డిగ్రీ సిలబస్‌లోనూ అవసరమైన మేరకు మార్పు చేయాలని యోచిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తున్నారనే దానిపైనా అధ్యయనం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని