Pulivendula: పులివెందులలో ‘ఫోర్‌ స్టార్‌’ పన్నాగం

స్టార్‌ హోటళ్లు ఎక్కడ కడతారు? సందర్శకులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్‌ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులలో ఫోర్‌స్టార్‌ హోటల్‌ కట్టేందుకంటూ తమ బంధువు క్లబ్‌హౌస్‌ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో రూ.12.87 కోట్లతో కొనిపించింది.

Updated : 03 Jul 2024 07:15 IST

హోటల్‌ పేరుతో జగన్‌ అనుయాయుడి క్లబ్‌హౌస్‌ కొన్న పర్యాటకాభివృద్ధి సంస్థ
అమ్మకందారు చెప్పిన రూ.12.87 కోట్లకే రిజిస్ట్రేషన్‌
సీఎంఓ అధికారుల ఆదేశాలతో అడ్డగోలు వ్యవహారం

పులివెందులలో పర్యాటకాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసిన క్లబ్‌హౌస్‌

ఈనాడు, అమరావతి: స్టార్‌ హోటళ్లు ఎక్కడ కడతారు? సందర్శకులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్‌ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులలో ఫోర్‌స్టార్‌ హోటల్‌ కట్టేందుకంటూ తమ బంధువు క్లబ్‌హౌస్‌ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో రూ.12.87 కోట్లతో కొనిపించింది. దాని యజమాని.. వివేకా హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి బావ వరసయ్యే విజయభాస్కర్‌రెడ్డి! మరో రూ.23.50 కోట్లతో దాన్ని స్టార్‌హోటల్‌గా అభివృద్ధి చేయించేందుకు టెండర్లు పిలిపించింది. పర్యాటకాభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యమిది. ఆయన జమానాలో సాగించిన అక్రమాలకు ఇదో మచ్చుతునక. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో హోటల్‌ పనులు నిలిచిపోయాయి. జగన్‌ తన కుటుంబం, సొంత మనుషుల కోసం పర్యాటకరంగ అభివృద్ధి పేరుతో ఊరుకో ప్యాలెస్, వాడకో స్టార్‌హోటల్‌ ప్రజాధనంతో నిర్మించుకున్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు దానికి ఏకపక్షంగా సహకరించారు. 

అడ్డగోలుగా క్లబ్‌హౌస్‌ కొనుగోలు

పర్యాటకరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ప్రైవేటు సంస్థలకు భూములు, స్థలాలు కేటాయించే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పులివెందులలో క్లబ్‌హౌస్‌ కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అప్పటి సీఎంఓ అధికారులు చెప్పారని పులివెందులలోని విజయహోమ్స్‌లో చవ్వ విజయభాస్కర్‌రెడ్డికి చెందిన 1.71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న క్లబ్‌హౌస్‌ను రూ.12.87 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందుకోసం పర్యాటకాభివృద్ధి సంస్థ అప్పటి ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి, సభ్యులుగా ఉన్న పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌భార్గవ (ఇటీవల బదిలీ అయ్యారు), పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ కన్నబాబు, ఇతర సభ్యులు తీర్మానం చేశారు. పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారుల అత్యుత్సాహంతో విజయభాస్కర్‌రెడ్డికి భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 1.71 ఎకరాల స్థలం రూ.1,65,52,800కు, అందులో 46,050 చదరపు అడుగుల్లో నిర్మించిన నిర్మాణాలను రూ.7,46,19,600కు కొన్నారు. మొత్తం రూ.9,11,72,400పై సవరించిన విలువ కింద మరో 41.18% (రూ.3,75,44,700) జతచేసి రూ.12,87,17,100 చెల్లించారు. 2023 సెప్టెంబరు 26న విజయవాడలోని పటమట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దీని రిజిస్ట్రేషన్‌ జరిగింది. 

జగన్‌ జమానాలో పర్యాటకాభివృద్ధి సంస్థ దివాలా 

గత ఐదేళ్లలో పర్యాటకరంగ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా జగన్‌  సొంత ప్రయోజనాల కోసం పర్యాటకాభివృద్ధి సంస్థను దివాలా తీయించారు. రుషికొండపై లక్షణంగా ఉన్న హోటల్, రెస్టారెంట్, సమావేశ మందిరం, ఇతర నిర్మాణాలు తొలగించి అదే స్థలంలో రాజభవనం నిర్మించారు. రుషికొండపై అప్పటికే ఉన్న నిర్మాణాల తొలగింపుతో పర్యాటకాభివృద్ధి సంస్థ గత మూడేళ్లలో రూ.10 కోట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుత రాజభవనం ద్వారా రూపాయి ఆదాయం లేకపోగా... విద్యుత్తుఛార్జీలు, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

ఎవరు బాధ్యులు? 

పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, రిసార్టుల మరమ్మతులకు నిధుల్లేవంటూ గత ఐదేళ్లూ బ్యాంకుల చుట్టూ తిరిగిన అధికారులు రూ.12.87 కోట్లతో ఆఘమేఘాలపై క్లబ్‌హౌస్‌ కొనేశారు. ఈ విషయాన్ని ఏడాదిన్నరగా గోప్యంగా ఉంచారు. పులివెందులలో స్టార్‌హోటల్‌ నిర్మిస్తే సంస్థకు ఉపయోగం ఉంటుందా? అని అధికారులు ఆలోచించలేదు. సీఎంఓ అధికారులు చెప్పినట్లుగా తలూపారు. రూ.12.87 కోట్లు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే. దీనికి ఎవరు బాధ్యులు? కొన్న ధరకు విక్రయించినా కొనేవారు లేరు. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


నిర్మాణ పనులకు రూ.23.50 కోట్ల పాడా నిధులు

క్లబ్‌హౌస్‌ను ఫోర్‌స్టార్‌ హోటల్‌గా రూ.23.50 కోట్లతో అభివృద్ధి చేసేందుకు పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) ద్వారా టెండర్లు పిలిచారు. 2023-24 బడ్జెట్‌ నుంచి నిధులు ఖర్చుచేసేందుకు తీర్మానం చేశారు. దీన్ని అభివృద్ధి చేసి తిరిగి పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. టెండర్‌ ఖరారు చేసిన పాడా అధికారులు గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో పనులు ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో కథ అడ్డం తిరిగింది. ఇప్పటివరకైతే పనుల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లు రద్దుచేయలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని