Tadepalli: దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?

పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్‌ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు.

Updated : 30 Jun 2024 13:25 IST

జగన్‌ ఇంటి ముందు మార్గం మూసేయడంతో ఇబ్బందులు 
ఇరుకుదారిలో విల్లా వాసుల అవస్థలు
నాలుగు చెక్‌పోస్టులు దాటుకుని వెళ్లాల్సిన దుస్థితి

బకింగ్‌హామ్‌ కాలువ పక్కన నాలుగు వరుసల రహదారి నుంచి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందుగా విల్లాలోకి వెళ్లే మార్గం మూసివేత

ఈనాడు, అమరావతి: పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్‌ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. జగన్‌ అధికార దుర్వినియోగానికి సంబంధించిన విషయాలన్నీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాడేపల్లిలోని తన నివాసం చుట్టూ చేసుకున్న భద్రత ఏర్పాట్లతో పరిసరాల్లో ఉంటున్న ప్రజలకు చుక్కలు చూపించారు. ఆయన ఇంటి పక్కన నాలుగు వరుసల మార్గం మూసేసి, అటుగా సామాన్యులు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. జగన్‌ నివాసం ఎదురుగా ఉన్న విల్లాలకు వెళ్లే దారి ఆయన ఇంటి మీదుగా వెళ్తుండడంతో దాన్ని మూసేశారు. దీంతో నాలుగు వరుసల రహదారి నుంచి నేరుగా విల్లాల్లోకి వెళ్లేవారు ప్రత్యామ్నాయంగా వెనుకవైపు నుంచి ఇరుకు రహదారిలో రాకపోకలు సాగిస్తూ అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు సీఎం హోదాలో ఉన్నందున ఇబ్బందులు పడ్డామని, ఇకనైనా మార్గాన్ని తెరవాలని స్థానికులు కోరుతున్నారు.


విల్లాల అంతర్గత రహదారుల్లో రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన పోలీసు ఔట్‌ పోస్టు

ప్లాన్‌లో మార్గం ఉన్నా ఎదురు చెప్పలేక..

తాడేపల్లిలో జగన్‌ నివాసం ముందు పార్క్‌ విల్లాస్‌ పేరుతో గేటెడ్‌ కమ్యూనిటీ ఉంది. ఈ విల్లాలకు బకింగ్‌హామ్‌ కాలువ పక్కనే ఉన్న నాలుగు వరుసల రహదారి నుంచి ప్రధానమార్గం ఉంది. మాస్టర్‌ప్లాన్‌లోనూ ఇదే మార్గానికి అనుమతించారు. అయితే జగన్‌ సీఎం అయ్యాక బకింగ్‌హామ్‌కాలువ పక్కనే ఉన్న నాలుగు వరుసల రహదారిని మూసేయడంతో పాటు అక్కడి నుంచి విల్లాల్లోకి వచ్చే ప్రధాన మార్గాన్ని మూసేశారు. సీఎం హోదాలో ఉన్నందున అక్కడివారు ప్రశ్నించలేక మిన్నకుండిపోయారు. ప్రత్యామ్నాయంగా జాతీయ రహదారి సర్వీసు రోడ్డు నుంచి ఇరుకుమార్గంలో వెళుతూ, నాలుగు పోలీసు చెక్‌పోస్టులు దాటుకుని అవస్థలు పడుతున్నారు. మరోవైపు విల్లాల్లో నుంచి జగన్‌ నివాసానికి వెళ్లే మార్గంలో రోడ్డును సగం ఆక్రమించి పోలీసులు టెంటు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినా, ఏవైనా పెద్దవాహనాలు వచ్చినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఈ మార్గం నుంచి కొందరు వీఐపీలు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేవారు. దాంతో భద్రత పేరుతో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. తమకు కనీసం ప్రత్యామ్నాయం చూపాలని విల్లా యజమానులు కోరుతున్నా ఐదేళ్లుగా పట్టించుకోలేదు. బకింగ్‌హామ్‌ కాలువ పక్కన ఉన్న రోడ్డునుంచి గోశాల పక్కన ఖాళీ స్థలం మీదుగా దారి ఇవ్వాలని ఓ గేటు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఇస్తే ప్రధాన రహదారి నుంచి నేరుగా విల్లావాసులు వెళ్లడానికి వీలవుతుంది. దీనికి సైతం అనుమతి ఇవ్వకుండా గేట్లు మూసేశారు. వైకాపా ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున నిబంధనల మేరకు లేఔట్‌ మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న మార్గాన్ని తెరవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే బకింగ్‌హామ్‌ కాలువ పక్కన నాలుగు వరుసల రోడ్డు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందున ఆ మార్గం నుంచి విల్లాల్లోకి వెళ్లే మార్గాన్నీ తెరవాలని వారు కోరుతున్నారు. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం జగన్‌ నివాసం ముందునుంచి దారి ఉన్నందున ఇప్పటికైనా నిబంధనలు అమలుచేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.


విల్లావాసులు రాకపోకలు సాగిస్తున్న ఇరుకైన రహదారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని