Andhra News: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. రెండున్నరేళ్ల తర్వాత కదిలిన పోలీసులు

తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు..

Published : 02 Jul 2024 04:58 IST

వైకాపా విధ్వంసం ఘటనలో ఎట్టకేలకు దర్యాప్తు మొదలు

ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆ కేసు దర్యాప్తును మళ్లీ మొదలుపెట్టారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. నాటి దాడి ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. దాడిలో పాల్గొన్న వ్యక్తుల చిత్రాలను సేకరించారు. కొంతమంది ఎవరనేది గుర్తించారు. మరికొంతమంది వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కార్యాలయ సిబ్బంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. వారి సెల్‌ఫోన్లలో అప్పట్లో రికార్డు చేసిన దృశ్యాల్ని కూడా తీసుకున్నారు. అప్పట్లో తేలికపాటి సెక్షన్ల కింద ఒకే ఒక్క కేసు నమోదు చేశారు. ఆ వివరాలన్నింటినీ తాజాగా మంగళగిరి గ్రామీణ పోలీసులు నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ ప్రక్రియంతా కొనసాగించారు. 

ఒక్క నిందితుడినీ గుర్తించలేదు... అరెస్టుల ఊసే లేదు

2021 అక్టోబరు 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైకాపా రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి. కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం సృష్టించాయి. తెదేపా నాయకుడు దొరబాబుతో పాటు ముగ్గురు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. డీజీపీ కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. ఒక్క నిందితుడ్నీ గుర్తించలేదు. అరెస్టుల ఊసే ఎత్తలేదు. కొందరికి 41ఏ నోటీసులిచ్చి మమ అనిపించేశారు. వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారులోనే దాడి చేయడానికి వచ్చారని, విధ్వంసానికి పాల్పడ్డవారిలో అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు పానుగుంట చైతన్య, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ అనుచరులు ఉన్నారంటూ.. వారి చిత్రాలను తెదేపా విడుదల చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కేసును పూర్తిగా నీరుగార్చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పోలీసులు మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని