PM Modi: అరకు కాఫీ అద్భుతం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్‌ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్‌కీబాత్‌’లోనూ దీని గురించి మాట్లాడారు.

Updated : 01 Jul 2024 06:23 IST

‘మన్‌కీబాత్‌’లో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించిన ప్రధాని మోదీ 
ఆ రుచిని ఆస్వాదించాలని దేశ ప్రజలకు పిలుపు

ఈనాడు, దిల్లీ-ఈనాడు డిజిటల్, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్‌ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్‌కీబాత్‌’లోనూ దీని గురించి మాట్లాడారు. ‘‘దేశీయంగా తయారవుతున్న ఎన్నో ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత డిమాండ్‌ ఉంది. భారత ఉత్పత్తులను ప్రపంచవ్యాప్త మార్కెట్‌లో చూసినప్పుడు సహజంగానే మనకు గర్వం కలుగుతుంది. అలాంటి వాటిలో అరకు కాఫీ ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని విస్తృతంగా ఉత్పత్తి చేస్తున్నారు. రుచి, సువాసనకు అది పెట్టింది పేరు. సుమారు 1.5 లక్షల గిరిజన కుటుంబాలు అరకు కాఫీ పంటసాగుతో మమేకమయ్యాయి.

అరకు కాఫీని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో గిరిజన సహకార సంఘం చాలా కీలకపాత్ర పోషిస్తోంది. అది రైతు సోదరులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కాఫీని సాగుచేసేలా ప్రోత్సహిస్తోంది. దీనివల్ల అక్కడి రైతుల ఆదాయం ఎంతో పెరిగింది. కొండదొర గిరిజన తెగ చాలా లబ్ధిపొందింది. ఆదాయంతోపాటు, గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతున్నారు. 2016లో ఒకసారి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఈ కాఫీ రుచి చూసే అవకాశం దొరికింది. అద్భుతంగా అనిపించింది. ఇప్పటికే ఈ కాఫీకి ఎన్నో గ్లోబల్‌ అవార్డులు లభించాయి. దిల్లీ వేదికగా జరిగిన జి-20 సదస్సులోనూ ఇది ప్రత్యేకంగా నిలిచింది. అందువల్ల మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఒకసారి అరకు కాఫీ రుచిని ఆస్వాదించండి’’ అని ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని ‘ఎక్స్‌’లోనూ ప్రధాని పోస్టు చేశారు.

అరకులోని కాఫీ తోట 


మీతో కలిసి మరో కప్పు ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నా

- చంద్రబాబు 

రకు కాఫీపై ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధానితో కలిసి మరో కాఫీని ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ‘‘మన గిరిజన సోదరులు ప్రేమ, భక్తితో దీన్ని పండిస్తారు. ఇది గిరిజన సాధికారత, స్థిరత్వం, ఆవిష్కరణల సమ్మేళనం. ఏపీ ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి ప్రతిబింబం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మేడిన్‌ ఏపీ’ ఉత్పత్తి అయిన అరకు కాఫీ గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ పోస్టు చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని