Pinnelli ramakrishna reddy: తొలిసారి జైలుకు పిన్నెల్లి.. 14 కేసులున్నా ఇప్పటివరకూ తప్పించుకుని..

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన జీవితంలో తొలిసారి జైలుపాలయ్యారు. ఆయనపై 14 కేసులున్నా ఇప్పటి వరకు శిక్ష పడకుండా తప్పించుకు తిరిగారు.

Updated : 28 Jun 2024 09:20 IST

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన జీవితంలో తొలిసారి జైలుపాలయ్యారు. ఆయనపై 14 కేసులున్నా ఇప్పటి వరకు శిక్ష పడకుండా తప్పించుకు తిరిగారు. ప్రస్తుతం తెదేపా అధికారంలోకి వచ్చాక జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేగా మిగిలారు. ఇది వరకు ఆయనపై చాలా కేసులు నమోదైనా ముందస్తు బెయిల్‌తోనో, పరారీ కావడమో చేసి శిక్ష నుంచి తప్పించుకునేవారు. ఈ ఏడాది పోలింగ్‌ రోజు జరిగిన ఈవీఎంల విధ్వంసం, ఆ తర్వాతి రోజు తెదేపా కార్యకర్తలపై దాడుల వ్యవహారానికి సంబంధించి కేసు నమోదైనా బయటపడాలని చూశారు. మాచర్ల నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పారిపోవాలని చేసిన ప్రయత్నాల వెనుక ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ ఐపీఎస్‌ అధికారి ఉన్నారని అంటారు. పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం, తెదేపా ఏజెంటుపై దాడి, కారంపూడిలో విధ్వంసం, సీఐపై హత్యాయత్నం కేసుల్లో గత నెల 28 నుంచి ముందస్తు బెయిల్‌తో మూడుసార్లు నెట్టుకొచ్చినా నాలుగోసారి హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో జైలుకెళ్లడాన్ని తప్పించుకోలేకపోయారు. 

  • 2004లో వెల్దుర్తి మండలంలో పంచలోహాల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుమానితుడు అని అంటారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా జాగ్రత్తపడి తప్పించుకున్నారు.
  • 2009లో రెంటచింతల మండలం రెంటాలలో పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లుగా కూర్చున్న తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఆరో నిందితుడిగా పిన్నెల్లి పేరు చేర్చారు. 
  • 2014లో మాచవరం మండలంలో సరస్వతీ భూముల వివాదంలో రైతులపై దాడిచేసి గాయపరిచారు. అప్పట్లో 120 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి ఉన్నారు. కానీ ముందస్తు బెయిల్‌ తెచ్చుకుని అరెస్టు నుంచి బయటపడ్డారు.
  • 2017లో వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో తెదేపా నేత పాపిరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు. కానీ ఈ కేసులో ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి మాత్రమే జైలుకెళ్లి వచ్చారు. పిన్నెల్లి తప్పించుకున్నారు.
  • 2019 ఎన్నికల్లోనూ అప్పుడు తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన అన్నపురెడ్డి అంజిరెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై పిన్నెల్లి సోదరులిద్దరూ దాడులకు తెగబడ్డారు. మాచర్ల టౌన్, రూరల్‌ ఠాణాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. వైకాపా అధికారంలోకి రావడంతో వీటిపై ఎవరూ చర్యలు తీసుకోలేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని