Pinnelli: ఇన్నాళ్లకు పాపం పండింది

అధికారాన్ని అడ్డం పెట్టుకుని కన్నూమిన్నూ కానకుండా పేట్రేగిపోయిన అరాచక శక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాపం ఎట్టకేలకు పండింది.

Updated : 27 Jun 2024 07:08 IST

ఎన్నో ఘోరాలు, నేరాలకు పాల్పడ్డ పిన్నెల్లి
మాచర్ల నియోజకవర్గాన్ని చంబల్‌లోయగా మార్చేసిన అరాచకశక్తి
లెక్కలేనన్ని ఘోరాలు, నేరాలకు పాల్పడ్డా ఏనాడూ జైలుకెళ్లని రామకృష్ణారెడ్డి
వైకాపా మూకల్ని తాలిబన్ల మాదిరిగా తయారు చేసి దారుణ దమనకాండ
తెదేపా సానుభూతిపరులపై దాడులు, హత్యలు

ఎన్నికల రోజు పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న పిన్నెల్లి

ఈనాడు, అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కన్నూమిన్నూ కానకుండా పేట్రేగిపోయిన అరాచక శక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాపం ఎట్టకేలకు పండింది. లెక్కలేనన్ని ఘోరాలు, నేరాలకు పాల్పడ్డా ఏనాడూ జైలుకెళ్లని ఆయన ఇన్నాళ్లకు కటకటాల వెనక్కి వెళ్లారు. మాచర్ల నియోజకవర్గాన్ని రావణకాష్ఠంలా మార్చేసి, వైకాపా మూకల్ని తాలిబన్లలా తయారుచేసి ప్రతిపక్షాలు, ప్రజలపై దారుణ దమనకాండకు తెగబడ్డ ఆ దౌర్జన్యకారుడు చివరికి అరెస్టయ్యారు. వంద గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలిందన్న సామెత పిన్నెల్లికి అతికినట్లుగా సరిపోతుంది. ఈవీఎంల విధ్వంసం, తెదేపా వర్గీయులపై దాడి, కారంపూడిలో విధ్వంసం, సీఐ నారాయణస్వామిపై హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు బుధవారం మధ్యాహ్నం కొట్టేసింది. ఆ వెంటనే పల్నాడు పోలీసులు ఆయన్ను నరసరావుపేటలో అరెస్టు చేశారు. మాచర్ల నియోజకవర్గాన్ని ఆయన సొంత సామ్రాజ్యంలా, చంబల్‌లోయను మించిన ఆటవిక రాజ్యంలా, అరాచకాలకు అడ్డాగా మార్చేసుకున్నారు. సహజ వనరులన్నింటినీ దోచుకున్నారు. ఏకంగా ఓ మాఫియానే నడిపించారు. నియోజకవర్గంలో ప్రతిపక్షం అన్నది లేకుండా నిర్మూలించాలన్నట్టుగా బరితెగించారు. ఆయన హయాంలో పలువురు తెదేపా కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. వారిపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. 

అసలే అరాచకశక్తి.. ఆపై అధికారం తోడైంది

అసలే అరాచక శక్తి.. ఆపై అధికారం తోడైతే ఇక అడ్డు ఏముంటుందన్నట్లుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని పేట్రేగిపోయారు. జిల్లా ఎస్పీ మొదలుకొని హోంగార్డు వరకూ మొత్తం పోలీసు వ్యవస్థ ఆయనకు పాదాక్రాంతమైంది. మాచర్లలో గత ఐదేళ్లలో పిన్నెల్లి రాజ్యాంగం, చట్టమే అమలైంది. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. ప్రజల్ని బెదిరించి ఆస్తులు లాక్కోవటం, ప్రతిపక్షాన్ని అణచివేయటమే లక్ష్యంగా హింసాకాండకు తెగబడ్డారు. పిన్నెల్లి ఆదేశిస్తేనే పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యేవి. ఎన్నికల వేళ కూడా వారి అరాచకం కొనసాగింది. పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి మరీ ఈవీఎంను నేలకేసికొట్టేంతగా, సీఐపైనే హత్యాయత్నానికి తెగబడేంతగా బరితెగించారు.  

ఏపీ పోలీసులు కాదు... పిన్నెల్లి పోలీసులు

మాచర్లలో గత ఐదేళ్లలో ఏపీ పోలీసులు కాదు.. పిన్నెల్లి పోలీసులు పనిచేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు దాడులు చేస్తే అసలు కేసులే నమోదు చేసేవారు కాదు. బాధితులు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారిపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టేవారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సి వస్తే తేలికపాటి సెక్షన్లు వర్తింపజేసి మమ అనిపించేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై మాత్రం హత్యాయత్నం కేసులు బనాయించేవారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెదేపా తరఫున నామినేషన్‌ వేద్దామనుకున్న కొందరు అభ్యర్థులకు పోలీసులే ఫోన్లు చేసి.. పోటీ ఆలోచన మానుకోకపోతే గంజాయి వ్యాపారం చేస్తున్నావని కేసులు పెడతామని బెదిరించారు. తెదేపా వారిని వైకాపాలో చేరాలంటూ వేధించేవారు. 

పిన్నెల్లిపై హత్యాయత్నం, ఎట్రాసిటీ కేసులు

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై గతంలో అనేక కేసులున్నా.. అధికార బలంతో అవి ముందుకెళ్లకుండా చేసుకున్నారు. 2014లో ప్రస్తుత పల్నాడు జిల్లా మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. తాజా ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో ఆయనపై మొత్తం నాలుగు కేసులున్నాయి. ఈ ఎన్నికల్లో ఈవీఎంల విధ్వంసంతో పాటు, హింసాకాండకు పాల్పడటంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. 

  • రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలో పోలింగ్‌ కేంద్రంలోకి రామకృష్ణారెడ్డి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేసిన ఘటనలో ఆయనపై నేరపూరిత కుట్ర, ప్రజాప్రాతినిధ్య చట్టం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 
  • ఈవీఎం ధ్వంసం చేసి పోలింగ్‌ కేంద్రం నుంచి బయటికి వస్తున్న రామకృష్ణారెడ్డిని నాగశిరోమణి అనే మహిళ నిలదీయడంతో ఆమెను తీవ్రంగా దుర్బాషలాడారు. దీనిపై రెంటచింతల పోలీసులు 506, 509, 131 (2ఆర్‌పీఏ 1951) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
  • ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన తెదేపా నేత నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారు. దీనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో 15 మందిపై రెంటచింతల పోలీస్‌ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. తనను చంపేందుకు పిన్నెల్లి వైకాపా శ్రేణుల్ని ఉసిగొల్పినట్లు శేషగిరిరావు ఫిర్యాదు చేశారు. రామకృష్ణారెడ్డిని ఇందులో ఏ-1గా పెట్టారు. 
  • మే 14న మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి వారి అనుచరులతో కలసి కారంపూడిలో బీభత్సం సృష్టించారు. రౌడీమూకలతో తెదేపా కార్యాలయంపై దాడిచేశారు. తెదేపా సానుభూతిపరులపై దాడులు చేస్తూ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడిచేయడంతో ఆయన గాయపడ్డారు. దీనిపై వీఆర్వో ఫిర్యాదు మేరకు పిన్నెల్లి సోదరులు, మరికొందరిపై సెక్షన్‌ 307, 332, 143, 147, 324, 149, 435, 427 కింద కేసు నమోదుచేశారు.

వెంకట్రామిరెడ్డి ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలం 

రాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాల్లో అన్నకు ఏ మాత్రం తీసిపోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిపైనా పలు కేసులున్నాయి. ఎన్నికల రోజు, మర్నాడు జరిగిన దాడులకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. వెంకట్రామిరెడ్డి అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కూడా పోలీసులు వెంకట్రామిరెడ్డి ఎక్కడున్నారో కనిపెట్టి, అరెస్ట్‌ చేయలేకపోయారు. క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిలో అత్యధికులు... ఇప్పటికీ పిన్నెల్లి సోదరుల సానుభూతిపరులే కావడం, వారి హయాంలోనే పోస్టింగులు తెచ్చుకున్నవారవడంతో, పోలీసుల కదలికలు ఎప్పటికప్పుడు వెంకట్రామిరెడ్డికి చేరవేస్తున్నట్టు సమాచారం. 


అన్నింటా దోపిడీయే 

నియోజకవర్గంలో అన్ని పదవులు, కాంట్రాక్టులు పిన్నెల్లి సోదరులకు, వాళ్ల మనుషులకే దక్కాలి. అన్ని వ్యాపారాలూ వాళ్లే చేయాలి. వెంకట్రామిరెడ్డి కనుసన్నల్లో ప్రతి గ్రామంలో మూడు, నాలుగు బెల్ట్‌షాపులు నడిపించారు. ప్రభుత్వ దుకాణాలకు వచ్చిన మద్యాన్ని సొంత షాపులు, బార్లకు తరలించారు. బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల నియోజకవర్గం మీదుగా తెలంగాణకు వెళ్లే గ్రానైట్‌ లారీల నుంచి రూ.12 వేల చొప్పున కప్పం వసూలు చేసి కోట్లు వెనకేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమించారు. పేకాట శిబిరాలు నిర్వహించారు. బెదిరించి, ప్రైవేటు భూములు లాక్కున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎవరైనా స్థిరాస్తి వెంచర్లు వేయాలన్నా, నిర్మాణాలు చేపట్టాలన్నా ఐదు శాతం వాటాను కప్పంగా కట్టించుకునేవారు. అపార్ట్‌మెంట్లు కట్టేవాళ్లు రూ.20-30 లక్షలు సమర్పించుకుంటేనే అనుమతులిచ్చేవారు.


తెదేపా కార్యకర్తల్ని చంపేసి.. మద్దతుదారుల్ని గ్రామాల నుంచి తరిమేసి

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలు గత ఐదేళ్లలో చేసిన అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు, దోపిడీకి అంతులేదు. వారి నేతృత్వంలో వైకాపా మూకలు పేట్రేగిపోయాయి. 2019లో వైకాపా అధికారం చేపట్టగానే తెదేపా మద్దతుదారుల్ని అనేకచోట్ల గ్రామ బహిష్కరణ చేసి కట్టుబట్టలతో తరిమేశారు. బంధుమిత్రులు చనిపోయినా చూడటానికి కూడా సొంతూరికి రాకుండా వారంతా ప్రాణభయంతో బతికాల్సిన పరిస్థితి కల్పించారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా నాయకుడు తోట చంద్రయ్యను పట్టపగలే నడిరోడ్డుపై గొంతు కోసి చంపారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను హత్య చేశారు.


నామినేషన్లు వేయనివ్వకుండా దాడులు.. బలవంతపు ఏకగ్రీవాలు

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని బెదిరించి, ఎవరూ నామినేషన్లు వేయకుండా బీభత్సం సృష్టించి మాచర్లలో అన్ని స్థానాలు, పదవులను బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తెదేపా శ్రేణులకు అండగా నిలిచేందుకు మాచర్ల వెళ్లిన తెదేపా నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నల కారుపై నడివీధిలో పిన్నెల్లి అనుచరుడు, స్థానిక వైకాపా నాయకుడు కిశోర్‌ సెంట్రింగ్‌ కర్రతో దాడి చేశారు. కారులో ఉన్న న్యాయవాదిని తీవ్రంగా గాయపరిచారు. 
  • నాటి తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టగా వైకాపా శ్రేణులు వారిపై దాడికి తెగబడ్డాయి. మాచర్లను రణరంగంగా మార్చేశాయి. బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, తెదేపా నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని