Pinnelli: పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్‌

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Updated : 28 Jun 2024 07:44 IST

నాలుగు గంటలపాటు వాదనల అనంతరం జడ్జి నిర్ణయం
భారీ బందోబస్తు మధ్య నెల్లూరు ఉప కారాగారానికి తరలింపు

నెల్లూరు కేంద్ర కారాగారంలోకి వెళుతున్న పిన్నెల్లి

ఈనాడు డిజిటల్‌ - నరసరావుపేట, న్యూస్‌టుడే - కారంపూడి, నెల్లూరు నేరవిభాగం: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్‌ విధించింది. గురువారం వేకువజామున 3.30 గంటల సమయంలో జడ్జి ఎస్‌.శ్రీనివాస కల్యాణ్‌ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై హత్యాయత్నం, పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో తెదేపా ఏజెంట్‌ నంబూరు శేషగిరిరావుపై దాడి కేసుల్లో జడ్జి ఆయనకు రిమాండ్‌ విధించారు. ఈవీఎం ధ్వంసం కేసు, పాల్వాయిగేటు వద్ద మహిళను దూషించిన కేసుల్లో మాత్రం బెయిల్‌ వచ్చింది. బుధవారం అర్ధరాత్రి 11.55కు మాచర్ల  అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు పిన్నెల్లిని పోలీసులు తీసుకొచ్చారు. జడ్జి ఎస్‌.శ్రీనివాస కల్యాణ్‌ కేసు విచారణ చేపట్టారు. సీఐపై దాడి కావాలని చేసింది కాదని, గాయం కూడా పెద్దది కాదని.. అందువల్ల ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని పిన్నెల్లి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపించారు. కారంపూడి సీఐపై దాడి కేసుతో పాటు, తెదేపా నేత కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనను కూడా పోలీసులు జడ్జి ముందు ప్రస్తావించారు. పిన్నెల్లి తరఫున న్యాయవాదుల వాదనతో జడ్జి ఏకీభవించలేదు. సీఐపై హత్యాయత్నం, తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసుల్లో 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చారు. అయితే పీపీ నాగిరెడ్డి తమకు ఏ మాత్రం సహకరించలేదని, పిన్నెల్లికి బెయిల్‌ వచ్చేలా చూశారని పోలీసులు న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. జడ్జి ఆదేశాల మేరకు పిన్నెల్లిని గురువారం వేకువజామున నాలుగు గంటలకు భారీ బందోబస్తు మధ్య నెల్లూరు కారాగారానికి తరలించారు. ఉదయం 9 గంటలకు రిమాండ్‌ చర్యలన్నీ పూర్తి చేసి, ఆయన్ను జైల్లోకి పంపామని జైలు సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని