Ramoji Rao: ఆకట్టుకున్న.. రామోజీ చిత్ర ప్రదర్శన

రామోజీరావు జీవిత ప్రస్థానంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆయన జీవితంలోని అమూల్యమైన క్షణాలన్నింటినీ కళ్లముందు ఆవిష్కృతం చేసిన ఈ చిత్ర ప్రదర్శనను ఆహూతులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Updated : 28 Jun 2024 06:39 IST

సామాన్యుడికి దారిదీపమై... ప్రదర్శనలో ఆకట్టుకున్న ఓ చిత్రం

రామోజీరావు జీవిత ప్రస్థానంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆయన జీవితంలోని అమూల్యమైన క్షణాలన్నింటినీ కళ్లముందు ఆవిష్కృతం చేసిన ఈ చిత్ర ప్రదర్శనను ఆహూతులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సామాన్యుడిగా జీవన యానం ఆరంభించి.. అంచెలంచెలుగా ఎదిగిన వైనం, మీడియా దిగ్గజంగా, పారిశ్రామికవేత్తగా, సినీ నిర్మాతగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్దదైన రామోజీ ఫిల్మ్‌సిటీని నెలకొల్పడం వంటి.. అనేక విజయాలకు సంబంధించిన అపురూప చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశంలో ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులను రామోజీరావు పలు సందర్భాలలో కలిసినప్పుడు తీసిన చిత్రాలు నాటి సంగతులను గుర్తుచేశాయి.


రామోజీరావు జీవిత చరిత్రను తెలిపే చిత్ర ప్రదర్శనను చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో మంత్రి కొలుసు పార్థసారథి తదితరులు

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆనాటి ప్రధాని పి.వి.నరసింహారావు, రాష్ట్రపతులు అబ్దుల్‌ కలాం, రామ్‌నాథ్‌ కోవింద్, అప్పటి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, దగ్గుబాటి రామానాయుడు, శోభన్‌బాబు, చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ సహా పలువురు ప్రముఖులతో వివిధ సందర్భాలలో ఆయన దిగిన ఫొటోలను ప్రదర్శనలో ఉంచారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు పుట్టిన ఇల్లు, తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి వెంకట సుబ్బమ్మ ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్న మధుర క్షణాలు, ‘ఈనాడు’ పత్రికను 1974లో విశాఖపట్నం కేంద్రంగా ఆరంభించిన నాటి నుంచి ఈ ఐదు దశాబ్దాల్లో ప్రజల పక్షాన నిలబడిన అనేక సంఘటనలు, దేశంలోని పలు భాషల్లో ఒకేసారి ఈటీవీని ప్రారంభించినప్పటి అపురూప ఘట్టానికి సంబంధించిన చిత్రాలను చూసేందుకు ప్రజలు బారులుతీరారు. ‘ఈనాడు’ జిల్లా పత్రికల ఆవిర్భావం, రైతులకు అండగా నిలిచేందుకు ఈనాడు, ఈటీవీలో అన్నదాత, జైకిసాన్, రైతేరాజు ఆరంభించినప్పటి ఫొటోలు, రామోజీరావు అతిథి పాత్రలో నటించిన ‘మార్పు’ చిత్రం పోస్టర్‌ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి.


చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని