Ramoji Rao: మా ఊరికి పెద్ద దిక్కు రామోజీరావు

‘మా పెదపారుపూడికి రామోజీరావే పెద్ద దిక్కు. ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఆయన సొంతూరి గురించి ఎంతో ఆలోచించేవారు.

Updated : 28 Jun 2024 08:17 IST

ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం 
గ్రామానికి ఆయన చేసిన మేలు మరచిపోలేం
సంస్మరణసభ వద్ద పెదపారుపూడివాసుల ఆవేదన

సభా వేదిక ముందు అక్షర శిఖరం రామోజీ అంటూ ముగ్గుతో వేసిన చిత్రం

ఈనాడు, అమరావతి - ఈనాడు డిజిటల్, అమరావతి: ‘మా పెదపారుపూడికి రామోజీరావే పెద్ద దిక్కు. ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఆయన సొంతూరి గురించి ఎంతో ఆలోచించేవారు. మేం తరచూ ఆయనను కలిసేవాళ్లం. ఎప్పుడు కలిసినా ఊరిలో సౌకర్యాల గురించి, రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించే అడిగేవారు. ఆయన మా ఊరిలో జన్మించడం మా అదృష్టం. పెదపారుపూడిలో ఎన్నో సమస్యలను ఆయనే పరిష్కరించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం నుంచి రహదారుల వరకూ అన్నీ ఆయన సొంత డబ్బులతో చేపట్టారు. చుట్టుపక్కల ఉండే గ్రామాలతో పోలిస్తే.. మా ఊరు అధునాతనంగా కనిపించడానికి రామోజీరావే కారణం. ఊళ్లో పాఠశాలలు, రైతు కేంద్రాలు, సిమెంట్‌ రహదారులు సహా వేటిని చూసినా ఆయనే గుర్తొస్తారు. అలాంటి మహానుభావుడు ఈరోజు లేరంటే నమ్మలేకపోతున్నాం’ అని కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కానూరులో జరిగిన రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొనేందుకు పెదపారుపూడి నుంచి ఆ ఊరివాళ్లంతా ప్రత్యేకంగా మూడు బస్సుల్లో తరలివచ్చారు. రామోజీరావుతో తమకు ఉన్న అనుబంధం, తమ ఊరికి జరిగిన మేలును గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.


రామోజీ సేవలు చిరస్మరణీయం..

పెదపారుపూడి గ్రామంతో రామోజీరావుది విడదీయలేని బంధం. గ్రామంలో రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు, మంచినీటి పైప్‌లైన్లు, వాటర్‌ ట్యాంకులు, మరుగుదొడ్లు, రైతు భరోసా కేంద్రం వంటి ఎన్నో అభివృద్ధి పనులను ఆయనే చేపట్టారు. ఆయన గ్రామానికి చేసిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి. రామోజీరావు మా ఊరికి చేసిన మేలును మేం ఎప్పటికీ మరచిపోం. ఆయన ప్రస్తుతం మన మధ్య లేరనే వాస్తవాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం.

చప్పిడి సమీర, సర్పంచి, పెదపారుపూడి


ఆ ఊరిలో పుట్టడం మా అదృష్టం

రామోజీరావు జన్మించిన గ్రామంలో మేం పుట్టడం మా అదృష్టం. దేశంలోనే ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలింసిటీని కట్టించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గ్రామాన్ని మరచిపోకుండా.. మాకు అవసరమైన తాగునీరు, పాఠశాల, రోడ్లు వంటివి ఎన్నో సౌకర్యాలను కల్పించారు. ఆయన మరణం మా ఊరికి తీరని లోటు, బాధాకరం.

కె.పూర్ణచంద్రరావు


గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు

మా ఊరిని దత్తత తీసుకుని.. రూ.కోట్లు ఖర్చు చేశారు. రామోజీ ఫౌండేషన్‌ ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. గ్రామంలో సామాన్యుడు జీవించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొన్నాళ్లు ఉంటే.. ఫిలిం సిటీ మాదిరిగా గ్రామాన్ని తీర్చిదిద్దుతారని అనుకున్నాం. ఆయన దూరం కావడం చాలా బాధాకరం.

శివరామకృష్ణ ప్రసాద్‌


ఆయనను మరిచిపోలేకపోతున్నాం..

తాను పుట్టిపెరిగిన ఊరిని మరచిపోకుండా దత్తత తీసుకుని మరీ అభివృద్ధి చేయడం అనేది అందరూ చేయలేరు. ఊరిలో ఏమేం సమస్యలున్నాయో తెలుసుకుని, అన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించడం మామూలు విషయం కాదు. అధిక దిగుబడి వచ్చే పంటలను వేయమని రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఆయన సంస్మరణ సభ జరుగుతోందని తెలిసి ఊరంతా తరలివచ్చాం. ఆయన కుటుంబానికి మా గ్రామస్థులమంతా జీవితాంతం రుణపడి ఉంటాం.

జి.మహదేవరావు


మా పిల్లలందరికీ ఆయనే స్ఫూర్తి

మా నాన్నకు.. రామోజీరావు మంచి మిత్రులు. గ్రామంలో చాలామందికి ఆయన సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయన స్ఫూర్తితోనే మా పిల్లలను క్రమశిక్షణతో పెంచి ఉన్నత స్థితిలో ఉంచగలిగాం. ఆయన మా ఊరికే కాదు.. ఈ దేశానికే ఆదర్శప్రాయులు. మా గ్రామానికి రామోజీరావు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దశాబ్దాలుగా మేం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన పరిష్కరించారు.  

టి.వెంకటాచారి


ఎంతఎదిగినా సొంతూరిని మరచిపోలేదు

ఉన్నత శిఖరాలకు ఎదిగినా ఒదిగి ఉండడం ఎలాగో రామోజీరావును చూసి నేర్చుకోవాలి. తన పట్టుదల, కృషితో ఉన్నతస్థానానికి చేరినా.. సొంత ఊరిని మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ఊరిని బాగు చేయించారు, భవనాలు కట్టించారు. చాలామందికి ఉద్యోగాలు కల్పించారు. గ్రామంలో తరచూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించేవారు. ఉచితంగా మందులు పంపిణీ చేసేవారు.

బి.గణేశ్‌బాబు


ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు

గ్రామంలో ప్రతి ఇంటికీ ఆయనే పెద్దకుమారుడిలా మారి.. సమస్యలను తీర్చారు. ఎంతోమందికి ఈనాడు, మార్గదర్శి, ఫిలింసిటీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇంటింటికీ తాగునీటి కుళాయిలు పెట్టించారు. ఊరిలో ఎన్నో ప్రభుత్వ భవనాలను కట్టించారు. చిన్నతనంలో తాను చదివిన పాఠశాలను రామోజీరావు ఇప్పుడు ఎంతో అధునాతనంగా తీర్చిదిద్దారు. 

జోసఫ్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు