AP news: ఏపీలో ఇచ్చిన 20.19 లక్షల పాస్‌ పుస్తకాలు వెనక్కి

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్‌ ఫొటోతో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు.

Updated : 27 Jun 2024 08:02 IST

రాజముద్రతో మళ్లీ పంపిణీ 

పాత పద్ధతిలోనే డిజైన్‌ 

అధికారులతో చర్చించిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్‌ ఫొటోతో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. రీ-సర్వే పూర్తైన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కుపత్రాలను ఇప్పటివరకు పంపిణీ చేశారు. మాజీ సీఎం జగన్‌ తన సొంత భూములను రైతులకు అందచేసినట్లు ‘జగనన్న భూ హక్కుపత్రం’ పేరుతో పట్టాదారు పుస్తకాన్ని రూపొందించి అందజేశారు. జగన్‌ ఫొటోతో పాస్‌పుస్తకాలు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించారు. తదుపరి చర్యల్లో భాగంగా సచివాలయంలో భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్‌ సిద్దార్థ జైన్‌తో బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 20.19 లక్షల భూహక్కు పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పత్రాల పంపిణీని ఆపేశారు. సుమారు లక్ష వరకు భూహక్కు పత్రాలను పంచాల్సి ఉంది. వీటిని నిలిపివేయనున్నారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇచ్చిన వాటిని ఉపసంహరించుకోవడంతోపాటు కొత్తవి ఎలా ముద్రించాలి? ఎప్పటి నుంచి పంపిణీ చేయాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.


గతంలో ఎన్నడూ పాస్‌పుస్తకాలపై సీఎం ఫొటోలేదు

ట్టాదారు పుస్తకాలను దశాబ్దాలుగా పంపిణీ చేస్తున్నారు. ఇలా ఎన్నడూ వాటి ఆధారంగా ప్రచారం జరగలేదు. భూ యజమాని పేరు, స్థల వివరాలతో ఉండాల్సిన పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని జగనన్న ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. పాస్‌పుస్తకంపై యజమాని ఫొటో కంటే..జగన్‌ ఫొటోలు పెద్ద సైజులో ముద్రించారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త పాస్‌ పుస్తకాలు దాదాపు పాత పద్ధతిలో ఉన్నట్లుగానే ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కొత్త పుస్తకాల తయారీపై దృష్టిపెట్టారు. నాలుగైదు నమూనాలను తయారుచేసి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించి ఆమోదం తీసుకోనున్నారు.

గత ప్రభుత్వ హయాంలో జగనన్న పేరుతో 74.65 లక్షల రాళ్లను పొలాల వద్ద పాతారు. కొన్నిచోట్ల సర్వే రాళ్లు అలాగే పడి ఉన్నాయి. వాటిని పాతవద్దని చెబుతున్నారు. అలాగే నాలుగైదు సైజుల్లో రాళ్లను తయారు చేయించి వాటిని సీఎంకు చూపించి ఆమోదం పొందనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని