Gokavaram: తూర్పుగోదావరి జిల్లాలో ప్రాణం నిలిపిన పింఛను!

ఇంటింటికి వెళ్లి పింఛను అందించడం ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. రెండు రోజులుగా గదిలోనే చిక్కుకుపోయిన అతణ్ని సచివాలయ సిబ్బంది గుర్తించి బయటకు తీసుకొచ్చారు.

Published : 04 Jul 2024 03:35 IST

మానసిక స్థితి సరిగా లేక గది లోపలి నుంచి తాళం వేసుకున్న వృద్ధుడు
రెండు రోజుల తర్వాత పింఛను ఇవ్వడానికి వెళ్లి గుర్తించిన సచివాలయ సిబ్బంది 

వృద్ధుడిని బయటకు తీసుకొచ్చి పింఛను అందిస్తున్న సిబ్బంది 

గోకవరం, న్యూస్‌టుడే: ఇంటింటికి వెళ్లి పింఛను అందించడం ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. రెండు రోజులుగా గదిలోనే చిక్కుకుపోయిన అతణ్ని సచివాలయ సిబ్బంది గుర్తించి బయటకు తీసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆనిమళ్ల వెంకటపురుషోత్తం(64)కు పిల్లలు లేరు. కొవిడ్‌ సమయంలో భార్య చనిపోవడంతో మానసికంగా కుంగిపోయారు. స్థానికంగా ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. పనులు చేసుకునే ఓపిక లేక పింఛను సొమ్ముపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆదివారం గది లోపలి నుంచి తాళం వేసుకున్న ఆయన కొంతసేపటి తర్వాత నిద్రపోయారు. లేచిన తర్వాత తాళం ఎక్కడ పెట్టారో మరిచిపోవడంతో గదిలో బందీగా మారారు. అతడు ఉంటున్న పోర్షన్‌ పక్కన ఎవరూ లేకపోవడం, చుట్టుపక్కల ఇళ్లు దూరంగా ఉండటంతో.. ఎవరూ అతడిని పట్టించుకోలేదు. ఒకటో తేదీన (సోమవారం) పింఛను సొమ్ము అందించడానికి సచివాలయ సిబ్బంది వృద్ధుడి ఇంటికి వెళ్లినా తలుపులు వేసి ఉండటంతో వెనుదిరిగారు. మంగళవారం సాయంత్రం మరొకసారి పరిశీలించగా లోపల వెంకటపురుషోత్తం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు సమాచారమిచ్చి గది తలుపులు పగులగొట్టారు. అతణ్ని బయటకు తీసుకొచ్చి రూ.7 వేలు పింఛను అందించారు. బాధితుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని