Guntur: అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?

‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్‌.శరత్‌బాబు విస్మయం వ్యక్తంచేశారు.

Updated : 30 Jun 2024 08:26 IST

జాతీయ లోక్‌ అదాలత్‌లో జిల్లా జడ్జి అభ్యంతరం
సముచిత మొత్తం ఇస్తేనే రాజీ చేస్తానని స్పష్టీకరణ

భరణం కేసులో భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న జడ్జి శరత్‌బాబు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: ‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్‌.శరత్‌బాబు విస్మయం వ్యక్తంచేశారు. గుంటూరు కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ఆయన కుటుంబ న్యాయస్థానానికి చెందిన కేసులను రాజీ మార్గంలో పరిష్కరించారు. ఈ సందర్భంగా రెండు కేసుల్లో భరణం కింద ఇస్తానన్న మొత్తాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఓ కేసులో గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన యువతికి విజయవాడకు చెందిన వ్యక్తితో పెళ్లయింది. వారికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ న్యాయస్థానంలో విడాకులు, భరణం కేసులు నడుస్తున్నాయి. పెద్దమనుషులు రూ.40 వేలకు రాజీ కుదిర్చారు. ఈ మేరకు శనివారం న్యాయమూర్తి ముందు రాజీ పత్రాలు దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి శరత్‌బాబు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘భర్త రూ.40 వేలకు మించి ఇచ్చేందుకు అంగీకరించలేదని, గతిలేక తాను రాజీకి అంగీకరించానని, తనకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడని భార్య తెలిపింది. ఆ సొమ్ముతో వాళ్లిద్దరూ ఎలా బతకగలరో చెప్పాల’ని ఆమె భర్తను న్యాయమూర్తి నిలదీశారు. భార్యాబిడ్డల పోషణకు తగినంత భరణం ఇవ్వకపోతే తాను రాజీ నమోదు చేయబోనని అతడికి స్పష్టం చేశారు. 

మరో కేసులో పాత గుంటూరుకు చెందిన మహిళకు బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన వ్యక్తితో ఏడేళ్ల కిందట వివాహం జరగగా.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త వారికి రూ.లక్ష ఇచ్చి కేసులు ఎత్తివేసి రాజీ కుదర్చమని పత్రాలు దాఖలు చేయగా ఆ కేసునూ న్యాయమూర్తి తిరస్కరించారు. భార్యాభర్తలను పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇంత కొద్దిమొత్తం ఇస్తే.. భార్యాపిల్లలు ఎలా జీవిస్తారని భర్తను ప్రశ్నించారు. చాలామంది దంపతులు విడాకుల కేసుల్లో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడంలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోక, సమాజంలో ఉన్నతస్థితికి ఎదగలేకపోతున్న విషయాన్ని గమనించాలని వారికి సూచించారు. ఈ రెండు కేసుల్లో భార్యాబిడ్డలు సంతృప్తికరంగా బతికేందుకు అవసరమైన సముచిత మొత్తంలో పరిహారం ఇస్తేనే రాజీ చేస్తానని వారికి జడ్జి శరత్‌బాబుతోపాటు లోక్‌ అదాలత్‌ సభ్యురాలు ఎస్‌.బి.ఏ.ఝాన్సీ తేల్చిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు