AP Pensions: ఊరువాడా ‘కొత్త పింఛన్ల కళ’

రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్‌ను లబ్ధిదారులకు అందించింది.

Updated : 02 Jul 2024 06:47 IST

తొలిరోజే 95 శాతం పంపిణీ
సచివాలయాల సిబ్బందితో అందజేత
పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు
18 రోజుల్లోనే ఎన్డీయే కీలక హామీ అమలు
లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం

పింఛను అందుకున్న విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన దివ్యాంగుడు కోలా దుర్గారావు సంతోషం

రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్‌ను లబ్ధిదారులకు అందించింది. సామాజిక భద్రత పింఛన్‌ను ఇంత పెద్దమొత్తంలో అందించడం దేశ చరిత్రలో రికార్డు. గతనెల వరకు వారికి రూ.3 వేల చొప్పున అందుతుండగా.. కొత్త ప్రభుత్వం ఒకేసారి రూ.1000 పెంచి, రూ.4 వేలు చేసింది. పైగా దాన్ని ఏప్రిల్‌ నెల నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించి, మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున అందించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 రోజుల్లోనే కీలక హామీని నెరవేర్చింది. లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వులు పూయించింది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర వర్గాల వారు పింఛను సొమ్మును చూసి మురిసిపోయారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందించారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొన్నారు. పలుచోట్ల వారు వినూత్న రీతిలో పంపిణీ చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. రాత్రి 10 గంటలకల్లా 95.05 శాతం (61.95 లక్షల మందికి) పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. మిగిలిన వారికి మంగళవారం వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నారు.

అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం పెదగుమ్ములూరులో వృద్ధురాలికి హోంమంత్రి అనిత  పింఛను అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

అసాధ్యమన్న దాన్ని.. సుసాధ్యం చేసి

ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించగా, అప్పటి వైకాపా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేందుకు విశ్వప్రయత్నం చేశాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల వద్దే నగదు అందించవచ్చని చంద్రబాబు సూచించినా పట్టించుకోలేదు. జిల్లా కలెక్టర్లు కూడా ఇళ్ల వద్ద పంపిణీ సాధ్యమని చెప్పినా వినిపించుకోలేదు. ఏప్రిల్‌ 1న మండుటెండల్లో వృద్ధులు, దివ్యాంగులను ఇళ్ల నుంచి బయటకు రప్పించి, గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిప్పి, వికృత క్రీడను నడిపారు. దానికి కారణం తెదేపానే అని చూపించేందుకు కుయుక్తులు పన్నారు. అదీ చాలదన్నట్లు మే నెల పింఛను మొత్తాన్ని ఏకంగా బ్యాంకుల్లో జమ చేసి అష్టకష్టాలు పెట్టారు. మొత్తంగా 33 మందికి పైగా వృద్ధుల మరణానికి కారకులయ్యారు. ఈ కుట్రను గ్రహించిన పింఛనుదారులు వైకాపాకు ఎన్నికల్లో ఓటు రూపంలో బుద్ధి చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సచివాలయాల సిబ్బంది ద్వారానే లబ్ధిదారులకు ఇళ్ల వద్ద నగదు అందజేసింది. గత ప్రభుత్వం అసాధ్యమన్న దానిని సుసాధ్యం చేసి చూపించింది.

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని మంచాడవలసలో లబ్ధిదారులకు పింఛన్లు అందించాక గ్రామస్థులతో కలిసి థింసా నృత్యం చేస్తున్నమంత్రి సంధ్యారాణి

తెల్లవారుజాము నుంచే..

రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల తెల్లవారుజామున 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖల వారు, తెదేపా నాయకులు పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందించారు. అధికారులు పంపిణీ తీరును నిరంతరం పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రక్రియ ప్రారంభమవడంతో ఉదయం గంటకుపైగా సర్వర్‌ మొరాయించింది. అధికారులు సరిదిద్దటంతో తర్వాత సాఫీగా సాగింది. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జోరు వానలోనూ పింఛన్లు అందజేశారు. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చారు.

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో మంచానికే పరిమితమైన దివ్యాంగుడికి పింఛను నగదు రూ.15 వేలు అందజేస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

వాడవాడలా క్షీరాభిషేకాలు

ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల హామీ నెరవేర్చడంపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకాలు చేశారు. ఇళ్ల వద్దకు వెళ్లిన తెదేపా, జనసేన, భాజపా నేతలకు లబ్ధిదారులు హారతులతో స్వాగతం పలికారు. పలుచోట్ల కేకులు కోసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కొన్నిచోట్ల థాంక్యూ సీఎం సర్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తర్లిపేటలో వికలాంగుడు బుడత అన్నయ్యకు పింఛన్‌ అందిస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు, మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి

ఉద్యోగులకు సీఎం అభినందనలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒకేరోజులో రికార్డు స్థాయిలో 95.05 శాతం పింఛన్లు పంపిణీ చేసిన అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఇంత భారీ స్థాయిలో పించన్ల పంపిణీ జరగలేదని పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేయగలరో.. పింఛన్ల పంపిణీతో మరోసారి రుజువైందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.


లబ్ధిదారుల ఉదారత.. ప్రభుత్వానికి విరాళాలు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం శివానగర్‌కు చెందిన చేనేత కార్మికురాలు బాలనారాయణమ్మ తనకు ఇచ్చిన రూ.7 వేల వృద్ధాప్య పింఛన్‌ను తిరిగి ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి ఈ సొమ్మును వినియోగించాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు ఆ మొత్తాన్ని అందించారు.

  • ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగలపల్లికి చెందిన నారాయణ రూ.7 వేల పింఛను సొమ్ముకు రూ.116 కలిపి రూ.7,116ను ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌కు అందజేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి వినియోగించాలని కోరారు.
  • గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామానికి చెందిన పాలకీటి తిరుపతయ్య రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులకు రూ.10 వేల నగదును విరాళంగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు అందజేశారు.
  • కనిగిరికి చెందిన దివ్యాంగుడు మాల్యాద్రి తనకు వచ్చిన పింఛన్‌ సొమ్ముకు రూ.4 వేలు కలిపి రూ.10 వేలు అమరావతి నిర్మాణానికి విరాళంగా అందజేశారు.
  • ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన పద్మావతి రూ.7 వేల పింఛనుకు మరో రూ.3 వేలు కలిపి రూ.10 వేలను రాష్ట్రాభివృద్ధికి విరాళంగా అందించారు.

అభిమానం చాటుకున్నారిలా!

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు వృద్ధురాలి కాళ్లు కడిగి పింఛను అందించారు. పలువురు లబ్ధిదారులకు పాదాభివందనం చేశారు.

  • అల్లూరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి రాజవొమ్మంగి మండలం లబ్బర్తిలో ఓ లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛను ఇచ్చి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
  • శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ లబ్ధిదారులకు స్వీట్లు తినిపించి మరీ సొమ్ము అందజేశారు.
  • ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పలు తండాల్లోకి మేళతాళాలతో వెళ్లారు. కడప నగరంలోనూ మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పింఛన్లు అందించారు.
  • రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం నెలటూరుకు చెందిన అంగారపు సురేశ్‌కు ఆసుపత్రికి వెళ్లి సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శి దీప్తి పింఛను అందించారు.

కూటమి అండగా.. కుటుంబంలో పండుగ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బెల్లండిపూడి గ్రామానికి చెందిన నారిన వెంకటేశ్వరరావు బ్రెయిన్‌స్ట్రోక్‌తో ఐదేళ్లనుంచి మంచానికే పరిమితమయ్యారు. గత ప్రభుత్వం ఇచ్చిన పింఛను డబ్బులు వైద్యానికి ఏ మూలకూ సరిపోయేవి కావు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన రూ.15 వేల పింఛను ఒక్కసారిగా ఆయన కుటుంబానికి సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఇది తమకు నిజమైన పండగ రోజు అని వెంకటేశ్వరరావు భార్య సూర్యకుమారి ఆనందబాష్పాలు రాల్చారు. 

పి.గన్నవరం, న్యూస్‌టుడే


మలిసంధ్యలో వెలుగు కిరణం: విజయవాడ గుణదలకు చెందిన వృద్ధురాలు సీసపు నారాయణమ్మ ఆనందోత్సాహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని