Ramoji Rao: విలువల శిఖరం రామోజీ

తెలుగుభాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం. తెలుగుజాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఆయన ఎప్పుడూ తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారు.

Updated : 28 Jun 2024 07:04 IST

ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం.. విశాఖలో చిత్రనగరి
ఎన్టీఆర్, రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత
ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు
ప్రజాచైతన్యంతో సేవలందించొచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి
భయమెరుగని జీవితం.. సమాజం కోసమే పోరాటం 
 ‘రామోజీరావు సంస్మరణ సభ’లో ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగుభాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం. తెలుగుజాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఆయన ఎప్పుడూ తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారు.

రేటింగ్‌ల కోసం పోరాడే రోజులివి. తిమ్మిని బమ్మిని చేస్తూ అధికారంలో ఏ పార్టీ ఉంటే అక్కడికి వెళ్లి పనులు చేయించుకునే పరిస్థితి. కానీ రామోజీరావు ఎప్పుడూ ఒక ఐఏఎస్‌ అధికారిని బదిలీ చేయమనో, ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలనో, ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలనో ఎక్కడా ఒక్క మాట చెప్పలేదు. ఒక్క పని కూడా అడగలేదు. ఆయన నీతి, నిజాయతీ, విలువల కోసం బతికారు. ప్రజల కోసం పోరాటాలు చేశారు.

మార్గదర్శిపై ఎన్నో కేసులు పెట్టారు. రామోజీరావును ఎన్నో రకాలుగా హింసించారు. అయినా సరే.. నేను ప్రజల కోసం పోరాడుతున్నా. నేను సంపాదించిన ఆస్తులివి. ఆస్తులన్నీ పోయినా రాజీపడేది లేదని చెప్పి పోరాడిన వ్యక్తి రామోజీరావు. భయం తెలియని వ్యక్తి ఆయన. 86 సంవత్సరాల వయసులోనూ ప్రజలకు న్యాయం చేయాలని తపించారు’

రామోజీరావు నాకు చెప్పిన మాట ఒక్కటే. మీరు రాజకీయాల్లో ఉన్నారు.. నేను పత్రికా రంగంలో ఉన్నాను. మన ఇద్దరం ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు.. మీ స్వేచ్ఛకు భంగం కలిగించను. నేను మిమ్మల్ని ఏమీ అడగను.. మీరు నన్నేం అడగొద్దని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన మహనీయుడు ఆయన. రాష్ట్రం కోసం, విలువల కోసం పని చేసిన వ్యక్తి.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు


ఈనాడు - అమరావతి

విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో రాజస్థాన్‌ పత్రిక ఎడిటర్‌ గులాబ్‌ కొఠారి,
హిందూ పూర్వ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఎన్‌.రామ్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్,
ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, నారా భువనేశ్వరి, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి తదితరులు

తెలుగుజాతికి, ప్రజలకు రామోజీరావు చేసిన విశేష సేవలను భావితరాలకు తెలియజెప్పేలా రాజధాని అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దిల్లీలోని విజ్ఞాన భవన్‌ తరహాలో కాన్ఫరెన్స్‌లు, రీసెర్చ్, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ నిర్వహించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో ఒక రహదారికి రామోజీరావు మార్గ్‌ అని పేరు పెడతామని వెల్లడించారు. రామోజీరావు తొలిసారి విశాఖపట్నంలో పత్రిక ప్రారంభించారని.. ఆయన స్మారకంగా అక్కడ రామోజీ చిత్రనగరి అని పేరు పెట్టి సినిమా చిత్రీకరణలు చేస్తామని ప్రకటించారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌తోనూ మాట్లాడానని చెప్పారు. ‘ఎన్టీఆర్‌ చనిపోయినప్పుడు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ కట్టాం. రామోజీరావుకు అలాంటి గుర్తింపు ఇవ్వాలి. దీనిపై అందరూ సలహాలు ఇస్తే.. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి తగిన గుర్తింపు ఉండేలా, ప్రజలకు చిరకాలం గుర్తుండేలా చేస్తాం’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించిన ‘రామోజీరావు సంస్మరణ సభ’లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌ కిరణ్‌ సహా పలువురు ప్రముఖులు మాట్లాడారు. ప్రజాస్వామ్యం 

అపహాస్యం పాలైనప్పుడు.. నేనున్నానంటూ వచ్చి ప్రజల తరఫున ముందుండి పోరాడిన వ్యక్తి రామోజీరావు.. అని చంద్రబాబు కొనియాడారు. పదవులు ఉంటేనే సేవ చేయొచ్చని చాలా మంది అనుకుంటారు.. ప్రజాసేవకు పదవులు అవసరం లేదని, ప్రజాచైతన్యంతో మేలైన పాలన, సేవలందించొచ్చని రామోజీరావు నిరూపించారని ప్రశంసించారు. ‘40 ఏళ్లుగా ఆయన్ను చూశాను. భయమనేదే ఆయన జీవితంలో లేదు. పోరాటం ఆయన జీవితంలో భాగం. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం మనందరిపైనా ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

రామోజీరావు ప్రజల ఆస్తి

‘రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థ వారి కుటుంబసభ్యులదే కాదు, పది కోట్ల మంది తెలుగు ప్రజలది. ఆ వ్యవస్థలన్నింటినీ భావితరాలకు అందించే బాధ్యత వారిది. ఆయన పేరు తెలుగుజాతి చరిత్రలో నిలిచేలా మనమంతా ఆలోచించాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్, రామోజీరావు ఇద్దరూ ఇద్దరే. వారికి భారతరత్న సాధించడం మనందరి బాధ్యత.. మహానాయకులు, యుగపురుషులకు మనం అర్పించే నివాళి అదే’ అని కొనియాడారు. ‘రాజకీయాలు, పత్రికా రంగం, సినిమాల్లో వారికి విశ్వసనీయత ముఖ్యం. ఎన్టీఆర్‌ను తెలుగుజాతి ఉన్నంత వరకు నంబర్‌ 1గా ఎలా గుర్తుంచుకుంటారో.. రాష్ట్రానికి సేవలందించిన వ్యక్తిగా తెలుగుజాతి రామోజీరావును అలాగే శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను, వారసత్వాన్ని కొనసాగించాలి’ అని కోరారు. 

వ్యక్తి కాదు.. వ్యవస్థ

‘కృష్ణా జిల్లా పెదపారుపూడిలో మామూలు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు అచంచల విశ్వాసంతో ఎదిగారు. ఒకే ఒక ఎన్టీఆర్‌.. ఒకే ఒక రామోజీరావు. వారిని ఎవరూ అధిగమించలేరు. అది అసాధ్యం. రామోజీరావు వ్యక్తి కాదు.. వ్యవస్థ. అసాధారణ శక్తి. ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే రాజీలేని పోరాటం చేశారు. ఏ రంగంలోకి ప్రవేశించినా మొదటి స్థానంలో నిలిచారు. వ్యాపారం, సినీ, సేవా, పత్రికా రంగాల్లో ఆయనకు ఆయనే సాటి. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ తుపాను, ఇతర విపత్తులొచ్చినప్పుడు బాధ్యతగా ముందుండి సేవలందించారు. పెదపారుపూడి, తెలంగాణలోని నాగన్‌పల్లి గ్రామాల్ని దత్తత తీసుకుని రూ.25 కోట్లు ఖర్చు పెట్టారు. కొవిడ్‌ సమయంలో రూ.20 కోట్లతో ప్రజలకు సేవలందించారు’ అని చంద్రబాబు ప్రశంసించారు. 

‘ఈనాడు’ ఎండీ కిరణ్, శైలజాకిరణ్‌ దంపతులతో మాట్లాడుతున్న చంద్రబాబు

ఆయన సూచనతోనే రాజధానికి అమరావతి పేరు

‘ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్, సైబరాబాద్‌ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేశాం. వాటిలో రామోజీరావు ఆలోచనలు ఉన్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతి అనే పేరు పెట్టాలని రామోజీరావే సూచించారు. ఆ పేరు ఎందుకు పెట్టాలో వివరిస్తూ పరిశోధనాపత్రం పంపారు. ఆ తర్వాత అమరావతి పేరు ప్రపంచమంతా మార్మోగింది. నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి’ అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘అమరావతి ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడింది. మళ్లీ అమరావతి దశ, దిశ మారుతుంది. తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది’ అని ఆయన ఆకాంక్షించారు. 

అభిప్రాయాల్ని నిస్సంకోచంగా చెప్పడమే తెలుసు

‘రామోజీరావు ఎవర్నీ పిలవరు. ఎవరూ తన దగ్గరకు రావాలని కోరుకోరు. ఎవరైనా వస్తే తగిన గౌరవం ఇస్తారు. సలహాలు అందిస్తారు. తన అభిప్రాయాల్ని నిస్సంకోచంగా చెప్పడం ఆయన అలవాటు. పనిచేస్తూ చనిపోవాలనే ఆయన కోరిక నెరవేరింది. నిరంతరం పని చేయాలనేది ఆయన ఆలోచన. కొంతమందే అలా ఆలోచిస్తారు. చనిపోవడం తథ్యమని, తాను చనిపోయాక ఎక్కడ అంత్యక్రియలు చేయాలో కూడా చెప్పిన వ్యక్తి ఆయన. కొన్ని పత్రికల్లో ఇతర పార్టీల వారి వార్తలు వేయరు. కానీ రామోజీరావు మాత్రం ప్రతి పార్టీ, నాయకుడికి సంఖ్యా బలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇస్తారు. కవరేజిలో ఎక్కడా తప్పు చేయరు. తన అభిప్రాయాలను ఎడిటోరియల్‌ పేజీలో చెబుతారు. అవసరమైనప్పుడు తప్పుల్ని ఎండగడతారు. అవతలివారు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్‌ చేయరు’ అని చంద్రబాబు గుర్తుచేశారు.

నారా భువనేశ్వరి, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి

రాజస్థాన్‌ పత్రిక ఎడిటర్‌ గులాబ్‌ కొఠారి పాదాలకు నమస్కరిస్తున్న రామోజీరావు మనవడు సుజయ్‌ 

సంస్మరణ సభకు హాజరైన రామోజీరావు కుటుంబ సభ్యులు వెంకట్‌ అక్షయ్, రేచస్‌ వీరేంద్రదేవ్, వినయ్, సోహన, సహరి, బృహతి, సుజయ్, దివిజ

సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులు, ప్రజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని