హెల్మెట్‌ వినియోగాన్ని తప్పనిసరి చేయండి: ఏపీ ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు ఆదేశం

హెల్మెట్లు ధరించకపోవడంతో  ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.

Updated : 27 Jun 2024 07:30 IST

ట్రాఫిక్‌ పోలీసులు, వాహన తనిఖీ అధికారులు బాడీ కెమెరాలు ధరించాల్సిందేనని వెల్లడి 

ఈనాడు, అమరావతి: హెల్మెట్లు ధరించకపోవడంతో  ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు తు.చ. తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేసింది. నిబంధనలను ఏమేరకు అమలు చేస్తున్నారో వివరిస్తూ కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాహనాల తనిఖీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు బాడీ కెమెరాలను తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని..తీవ్రంగా పరిగణించాలని తేల్చిచెప్పింది. హెల్మెట్లు ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. మోటారు వాహనాల చట్ట నిబంధనలను తెలియజేస్తూ అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 


హెల్మెట్‌ ధరించని కారణంగా 3,042 మంది కన్నుమూశారు 

 కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, జరిమానాలు విధించకుండా ఉదారత చూపుతున్నారని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. బుధవారం జరిగిన విచారణలో యోగేష్‌ వాదనలు వినిపిస్తూ హెల్మెట్లు ధరించని కారణంగా 3,042 మంది చనిపోయారన్నారు. హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనాలను నడపడాన్ని విజయవాడలో తాము గమనిస్తూనే ఉన్నామని ధర్మాసనం పేర్కొంది. ప్రజాప్రయోజనం ఉన్న పిల్‌ను దాఖలు చేశారంటూ తాండవ యోగేష్‌ను కోర్టు అభినందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు