Mahesh chandra Ladha: నిఘా విభాగం అధిపతిగా మహేష్‌చంద్ర లడ్హా!

ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగం అధిపతిగా మహేష్‌చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా కొనసాగుతున్నారు.

Published : 29 Jun 2024 06:42 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగం అధిపతిగా మహేష్‌చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌ ముగించుకుని ఒకటిరెండు రోజుల్లో రాష్ట్రానికి వచ్చి రిపోర్ట్‌ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన్ను ఏపీ నిఘా విభాగం అధిపతిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. 2005లో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండగా ఒంగోలు నడిబొడ్డున మావోయిస్టులు క్లెమోర్‌ మైన్లతో లడ్హా వాహనాన్ని పేల్చేశారు. అది బుల్లెట్‌ప్రూఫ్‌ కావటంతో.. లడ్హా, ఆయన ఇద్దరు గన్‌మెన్, డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో సామాన్య పౌరులు ఇద్దరు మృతిచెందగా నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. 

  • గ్రేహౌండ్స్‌లో అసాల్ట్‌ కమాండర్‌గా మొట్టమొదట ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మహేష్‌చంద్ర లడ్హా ఆ తర్వాత చింతపల్లి ఏఎస్పీగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆపరేషన్స్‌ విభాగం ఓఎస్డీగా పనిచేశారు. ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా, హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)లో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు.
  • విజయవాడ నగర జాయింట్‌ పోలీసు కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగా, విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 
  • 2019 నుంచి 2020 మధ్య ఏపీ పర్సనల్‌ విభాగం ఐజీగా పనిచేసి... తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయి సీఆర్‌పీఎఫ్‌లో బాధ్యతలు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికి తిరిగిరానున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని