AP News: బంగాళాఖాతంలో అల్పపీడనం

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయవ్య దిశగా పయనించనుంది.

Published : 29 Jun 2024 06:11 IST

రాష్ట్రానికి తుపాను ముప్పు లేనట్లే..!

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయవ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడనం తుపానుగా మారుతుందా..? లేదా.? అనే విషయాన్ని వాతావరణ శాఖ స్పష్టం చేయలేదు. ఒకవేళ తుపానుగా రూపాంతరం చెందినా రాష్ట్రంపై ప్రభావం ఉండదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఏర్పడిన తొలి అల్పపీడనంగా పేర్కొంటున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయవ్య దిశగా పయనించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌ వైపు వెళ్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. పిడుగులతోపాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని