Jawahar Reddy: ఏపీ ప్రభుత్వం హుందాతనం.. జవహర్‌రెడ్డికి మళ్లీ పోస్టింగ్‌

వైకాపా ప్రభుత్వంలో కీలక హోదాల్లో వివాదాస్పదంగా పనిచేసి, ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్న ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు రిటైర్మెంట్‌ ముంగిట పోస్టింగులు ఇచ్చి కూటమి ప్రభుత్వం హుందాగా వ్యవహరించింది.

Updated : 28 Jun 2024 07:58 IST

పూనం మాలకొండయ్యకు కూడా
ఈ నెలాఖరులోనే ఇద్దరి రిటైర్మెంట్‌ 

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వంలో కీలక హోదాల్లో వివాదాస్పదంగా పనిచేసి, ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్న ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు రిటైర్మెంట్‌ ముంగిట పోస్టింగులు ఇచ్చి కూటమి ప్రభుత్వం హుందాగా వ్యవహరించింది. వారిలో ఒకరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి కాగా, మరొకరు పూనం మాలకొండయ్య.

గత ప్రభుత్వంలో సీఎస్‌గా పనిచేసిన జవహర్‌రెడ్డి.. నాటి అధికార పార్టీ పెద్దలతో అంటకాగడంతో పాటు ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు మూటగట్టుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలకు ప్రయోజనం చేకూర్చడం కోసం తీవ్రంగా శ్రమించారు. పింఛన్ల కోసం వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడేలా చేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్‌ విషయంలో కూడా రిటైర్మెంట్‌ ముందు అమానవీయంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించగా ఆయన కోర్టుకు వెళ్లి పోస్టింగ్‌కు అనుమతి పొందాల్సి వచ్చింది. ఇలాంటి వివాదాస్పద చర్యల కారణంగా ఎన్నికల ఫలితాల అనంతరం జవహర్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టినా.. ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పోస్టింగ్‌ ఇచ్చి హుందాగా వ్యవహరించింది. పోస్టింగ్‌ లేకపోతే అవమానకరంగా పదవీవిరమణ చేయాల్సి వచ్చేది. దీంతో ఆయనను ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనకబడిన వర్గాలు) సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంత రామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

నిరీక్షణలో ఉన్న పూనం మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న పోలా భాస్కర్‌ను అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశించారు. పూనం మాలకొండయ్య వైకాపా హయాంలో నాటి సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కూడా ఈ నెలాఖరులో రిటైర్‌ కానున్నారు. 

సీఎం ముఖ్య కార్యదర్శిగా పీయూష్‌కుమార్‌ 

ఇటీవల కేంద్ర సర్వీసునుంచి ఏపీ కేడర్‌కు వచ్చిన పీయూష్‌ కుమార్‌ను సీఎంకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆర్థికశాఖ (పీఎఫ్‌ఎస్‌) ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్‌ఎస్‌ రావత్‌ సెలవులో ఉన్నారు. ఆయన్ను రిలీవ్‌ చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని