AP news: గ్రామాలకు జగన్‌ ద్రోహం

గ్రామీణాభివృద్ధికి దోహదం చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించడమే కాదు.. కేంద్రం ఇతర పథకాల కింద ఇచ్చే నిధులూ ఉపయోగించుకోలేకపోయింది.

Published : 29 Jun 2024 06:16 IST

మురిగిపోయిన రూ.2,082 కోట్ల ‘మెటీరియల్‌’ నిధులు

ఈనాడు, అమరావతి: గ్రామీణాభివృద్ధికి దోహదం చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించడమే కాదు.. కేంద్రం ఇతర పథకాల కింద ఇచ్చే నిధులూ ఉపయోగించుకోలేకపోయింది. అనాలోచిత నిర్ణయాలు, ప్రణాళిక లోపంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో రూ.2,082.80 కోట్ల మెటీరియల్‌ నిధులు మురిగిపోయాయి. 2023-24 సంవత్సరానికి రాష్ట్రానికి సమకూరిన రూ.4,186.20 కోట్ల మెటీరియల్‌ నిధుల్లో ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రూ.2,103.40 కోట్లే ఖర్చు చేయగిలిగారు. మిగిలిన నిధులు నిరుపయోగమయ్యాయి. అప్పటికే చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో మిగతా పనుల నిర్వహణకు గుత్తేదారులు ముందుకు రాలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నిధులు వినియోగించుకోలేని కారణంగా మిగిలినవి కేంద్ర ప్రభుత్వం రద్దుల పద్దులో చేర్చేసింది.

గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం మెటీరియల్‌ నిధుల వినియోగంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సరైన ప్రణాళిక లేకుండా రూ.9,871 కోట్లతో గ్రామాల్లో 34,586 భవనాల నిర్మాణానికి మొదట అనుమతులిచ్చింది. 20 వేల భవన నిర్మాణ పనులు ప్రారంభం కాగా ఐదేళ్లలో సగం కూడా పూర్తి చేయలేకపోయారు. భారీ లక్ష్యాలు పెట్టుకోవడం, చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యంతో ఈ పరిస్థితి తలెత్తింది.

నిధుల దుర్వినియోగం 

ఎన్నికల ముందు గ్రామాల్లో రహదారులు, కాలువల నిర్మాణం కోసం మండలానికి రూ.60 లక్షలు చొప్పున మెటీరియల్‌ నిధులతో పనులు  ప్రతిపాదించినా ఎవరూ ముందుకు రాలేదు. పనులు ప్రారంభించేలోగా 2023-24 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగియడంతో ఆ ఏడాది సమకూరిన నిధుల్లో ఖర్చు చేయగా మిగిలిన రూ.2,082.80 కోట్లు మురిగిపోయాయి. నిధులు ఖర్చు చేయకపోతే కేంద్రం మళ్లీ ఇచ్చే అవకాశం లేదన్న విషయం తెలిసినప్పటికీ గత ప్రభుత్వం ఎలాంటి చొరవా తీసుకోలేదు.


8 జిల్లాల్లో సగం నిధులూ ఖర్చు చేయలేదు

పాధి హామీ పథకంలో 2023-24లో రాష్ట్రానికి సమకూరిన మెటీరియల్‌ నిధులను ఎనిమిది జిల్లాల్లో సగం కూడా ఖర్చు చేయలేదు. మిగతా జిల్లాల్లోనూ అరకొరగానే వినియోగించుకోగలిగారు. గత ఏడాది కూలీలు చేసిన పనుల వ్యయం (లేబర్‌ బడ్జెట్‌) రూ.6,276.17 కోట్లపై 2/3 కింద రూ.4,186.20 కోట్ల మెటీరియల్‌ నిధులు సమకూరాయి. వీటిలో ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రూ.2,103.40 కోట్లే ఖర్చు చేయగలిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని