Nellore: అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం

ధనార్జనే ధ్యేయంగా గత ఐదేళ్లలో వైకాపా నాయకులు వీలున్నచోటల్లా అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు.

Updated : 05 Jul 2024 08:06 IST

ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో దందా

పొదలకూరు మండలంలోని వివాదాస్పద లేఅవుట్‌ను పరిశీలిస్తున్న అధికారులు 

ఈనాడు, నెల్లూరు: ధనార్జనే ధ్యేయంగా గత ఐదేళ్లలో వైకాపా నాయకులు వీలున్నచోటల్లా అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ క్రమంలో ప్రభుత్వ స్థలాలు, కాలువలను ఆక్రమించడం ఒక ఎత్తయితే.. డీటీసీపీ (డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) అనుమతి తీసుకోకుండా.. తీసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి..వాటిని చూపి ప్రజలకు ప్లాట్లు అంటగట్టి కూడా జేబులు నింపుకొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైకాపా నాయకుల అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఆయన అనుచరులు వేసిన లేఅవుట్‌ అక్రమమని తాజాగా గుర్తించిన నుడా (నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అధికారులు పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. 

కాకాణి స్వగ్రామంలోనే 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోడేరు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్వగ్రామం. దీని పరిధిలో.. సర్వే నంబరు 329, 330/ఏలతో పాటు.. పొదలకూరు పరిధిలోని 174తో కలిపి మొత్తం 18.44 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారు. ఇది పొదలకూరు గ్రామానికి సమీపంలో రహదారికి ఆనుకుని ఉంది. గతంలో వ్యవసాయ భూమి కాగా, మాజీ మంత్రి కాకాణి అనుచరులు, కొందరు వైకాపా నాయకులు లేఅవుట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అధికారం ఉందని.. తమను ఎవరు అడ్డుకుంటారులే అనే ధీమాతో నుడా నుంచి ఎలాంటి అనుమతీ తీసుకోలేదు. స్వర్ణా గార్డెన్స్‌ పేరుతో రాళ్లు పాతారు. రోడ్లు వేయడంతో పాటు.. కాలువలు తవ్వారు. మొత్తంగా 207 ప్లాట్లు వేశారు. కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో.. వైకాపా నాయకులు ఎలాగైనా వాటిని విక్రయించాలన్న దుర్బుద్ధితో నకిలీ డీటీసీపీ అనుమతి పత్రాలు సృష్టించారు. టి.ఎల్‌.పి నంబరు 72/2022/జీతో అనుమతి ఇచ్చినట్లు డాక్యుమెంట్లను సిద్ధం చేశారు. వాటిపై డీటీసీపీ డైరెక్టర్, అడిషనల్‌ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఏడీఎంల సంతకాలు ఫోర్జరీ చేశారు. వాటిని చూపించి విక్రయాలు చేస్తున్నారు. నగదు తీసుకుని కాగితాలపై ఒప్పందాలు రాసుకుంటున్నారు. విషయం నుడా వీసీ బాపిరెడ్డి దృష్టికి రావడంతో గురువారం పొదలకూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్రమంగా లేఅవుట్‌ వేయడంతో పాటు.. నకిలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ సంతకాలు చేయడంపై విచారించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. 

రూ. కోట్లు దోచుకోవడమే.. ధ్యేయంగా

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో వైకాపా పాలనలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. లేఅవుట్‌ వేయడం నుంచి ఆ ప్రాంతంలో మెరకవేసేందుకు మట్టి తరలింపు వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవనే విమర్శలు ఉన్నాయి. అందుకు ఉదాహరణే ‘స్వర్ణా గార్డెన్స్‌’ పేరుతో వేసిన లేఅవుట్‌. దీని విస్తీర్ణం 18.44 ఎకరాలు కాగా, ఇదంతా అడంగల్‌లో వ్యవసాయ భూమిగానే ఉంది. కనీసం వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకూ యత్నించలేదు. అలాగే లేఅవుట్‌ వేశారు. రోడ్డుకు దిగువగా ఉండే దానిలో మెరక తోలేందుకు వెంకటాచలం మండలం కనుపూరు చెరువు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా టిప్పర్లతో మట్టిని తరలించారు. దీని కోసం కనుపూరు చెరువు ఆయకట్టు రైతులకు నీరివ్వకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అనుమతి ఉందన్న కారణం చూపి.. ప్లాట్ల ధరలు విపరీతంగా పెంచారు. ఒక్కో అంకణం ప్లాట్‌ను రూ.లక్షన్నర వరకు విక్రయించారు. కొనుగోలుదారుల నుంచి రూ. కోట్లు వసూలు చేశారు. ప్రస్తుతం ఆ లేఅవుట్‌ను అధికారులు పరిశీలించడం, కేసు నమోదు కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. వైకాపా నాయకులను నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు