N.Ram: ప్రభుత్వాల ఒత్తిళ్లు, దాడులను ఎదుర్కొంటూ.. విలువల కోసమే పోరాడిన వ్యక్తి

వ్యతిరేక వార్తలను ప్రచురిస్తున్నారనే కక్షతో రామోజీరావు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా ఆయన ఎంతో ధైర్యంగా నిలబడ్డారని హిందూ పత్రిక పూర్వ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఎన్‌.రామ్‌ కొనియాడారు.

Updated : 28 Jun 2024 06:39 IST

హిందూ పూర్వ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఎన్‌.రామ్‌

వ్యతిరేక వార్తలను ప్రచురిస్తున్నారనే కక్షతో రామోజీరావు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా ఆయన ఎంతో ధైర్యంగా నిలబడ్డారని హిందూ పత్రిక పూర్వ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఎన్‌.రామ్‌ కొనియాడారు. ‘‘ప్రభుత్వాల ఒత్తిళ్లు, దాడిని ఎదుర్కొంటూ.. వార్తాపత్రికల స్వతంత్రతను కాపాడిన వ్యక్తి రామోజీరావు. మరణానికి కొద్దిరోజుల ముందు కూడా దాడులు కొనసాగాయి. అయినా ధైర్యంగా నిలబడ్డారు. అన్నీ పోగొట్టుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. నమ్మిన విలువలకు కట్టుబడి పోరాడారు. భారత పాత్రికేయ రంగంలోనే అరుదైన వ్యక్తి రామోజీరావు. విశ్వసనీయ పాత్రికేయం, క్లిష్టమైన పరిశోధనాత్మక జర్నలిజాన్ని ఆయన నమ్మారు’’ అని ప్రశంసించారు. పత్రికలను లక్ష్యంగా చేసుకుని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం తెచ్చిన నేరపూరిత పరువునష్టం బిల్లును అడ్డుకునేందుకు ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడిగా రామోజీరావు పోరాటం చేశారని ఎన్‌.రామ్‌ గుర్తుచేశారు. ‘‘రామోజీరావు ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి నాకు తెలుసు. అవినీతి, అధికార దుర్వినియోగంపై పరిశోధనాత్మక జర్నలిజం దూకుడుగా సాగుతున్న రోజులవి. బోఫోర్స్‌ కుంభకోణాన్ని బయటపెట్టడంలో నా పాత్ర ఉంది. 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పత్రికలు, పాత్రికేయుల్ని వేధించే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న చట్టం కంటే క్రూరమైన నిబంధనలతో క్రిమినల్‌ పరువు నష్టం బిల్లు ప్రవేశపెట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమంలో ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడిగా ఉన్న రామోజీరావుతో కలిసి పనిచేశాం. ఆయన పోరాటం ఫలితంగా రాజీవ్‌గాంధీ అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పుడు రామోజీరావు పూర్తి సంతృప్తి చెందారు’’ అని ఆనాటి విషయాలను వెల్లడించారు. ‘‘భారత వార్తాపత్రికా రంగంలో ‘ఈనాడు’ ద్వారా రామోజీరావు విప్లవాత్మక మార్పులు తెచ్చారు. కొత్త టెక్నాలజీతో పాటు క్షేత్రస్థాయి రిపోర్టింగ్, మార్కెటింగ్‌ విధానాలను ప్రవేశపెట్టారు. జిల్లా పత్రికల ద్వారా స్థానిక వార్తలకు ప్రాధాన్యం పెంచారు. ఉత్తమ కథనాలను అందించారు. ఈ వివరాల్ని ఉటంకిస్తూ 2000వ సంవత్సరంలో భారత వార్తాపత్రికల విప్లవం పేరుతో నా స్నేహితుడైన ఆస్ట్రేలియన్‌ రాజకీయ శాస్త్రవేత్త రాబిన్‌ జెఫ్రీ రాసిన పుస్తకం ఎంతో ఆదరణ పొందింది’’ అని రామ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని