AP News: మచిలీపట్నం పూర్వ కమిషనర్‌ చంద్రయ్యపై హైకోర్టు ఆగ్రహం

న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారి ఎస్‌.వెంకటేష్‌ను విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించిన మచిలీపట్నం నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్‌ జి.చంద్రయ్య (ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రస్తుత అదనపు కమిషనర్‌)కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.

Published : 29 Jun 2024 06:03 IST

కోర్టుధిక్కరణ కేసులో 6 నెలల జైలుశిక్ష, రూ 2వేల జరిమానా విధింపు
కోర్టు ఆదేశాలకు రంధ్రాన్వేషణ  చేయకుండా వాటి అమలే  అధికారుల విధి అని స్పష్టీకరణ
అప్పీలు దాఖలుకు వీలుగా శిక్ష అమలు 4 వారాల నిలుపుదల

ఈనాడు, అమరావతి: న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారి ఎస్‌.వెంకటేష్‌ను విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించిన మచిలీపట్నం నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్‌ జి.చంద్రయ్య (ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రస్తుత అదనపు కమిషనర్‌)కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అప్పీలు దాఖలుకు సమయం కావాలని చంద్రయ్య తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో శిక్ష అమలును నాలుగు వారాలు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. కోర్టు ఉత్తర్వులకు రంధ్రాన్వేషణ చేయకుండా వాటిని అమలు చేయడమే అధికారుల విధి అని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీలు దాఖలు చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులపై చంద్రయ్య అవిధేయత చూపినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వ్యవహారాన్ని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌కు వదిలేస్తున్నట్లు చెప్పారు. చంద్రయ్య వ్యవహారశైలి చట్టబద్ధ పాలనకు అవరోధం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాక న్యాయవ్యవస్థకు, పాలనకు తీవ్ర నష్టం చేస్తుందని మండిపడ్డారు.

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్‌ తనను విధుల్లోకి తీసుకోవడం లేదంటూ రెవెన్యూ అధికారి ఎస్‌.వెంకటేష్‌ 2023లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. విధుల్లోకి తీసుకునే విషయంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఉత్తర్వులు, పిటిషనర్‌ వినతిని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీచేయాలని 2023 మే 12న తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను చంద్రయ్య అమలుచేయకపోవడంతో వెంకటేష్‌ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పూర్వ కమిషనర్‌ చంద్రయ్య తీరును తీవ్రంగా తప్పుపట్టారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ 2022 అక్టోబర్‌లో జారీచేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. వెంకటేష్‌ను సస్పెండ్‌ చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తూ.. తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు స్పష్టంగా ఉందని తెలిపారు. కోర్టు ఆదేశాలతో పాటు ఉన్నతాధికారి ఉత్తర్వులను చంద్రయ్య ఉల్లంఘించారని స్పష్టంచేశారు. పిటిషనర్‌ను విధుల్లోకి తీసుకోకుండా ఆయన కోర్టు ఉత్తర్వులను అగౌరవపరిచారన్నారు. ఈ నేపథ్యంలో చంద్రయ్యకు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ. 2వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని