Andhra News: గంజాయి, డ్రగ్స్‌ కట్టడికి యాంటీ నార్కొటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు యాంటీ నార్కొటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఏఎన్‌టీఎఫ్‌) ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

Published : 05 Jul 2024 04:36 IST

ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబర్‌
సమాచారమిస్తే నగదు బహుమతులు
వంద రోజుల్లో నియంత్రణ, రెండేళ్లలో నిర్మూలన
మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు

మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న సత్యకుమార్, వంగలపూడి అనిత, లోకేశ్, గుమ్మిడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు యాంటీ నార్కొటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఏఎన్‌టీఎఫ్‌) ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఐజీ స్థాయి అధికారిని దీనికి అధిపతిగా నియమించాలని, జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారులను బాధ్యులుగా పెట్టాలని తీర్మానించింది. దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలని, పది రోజుల్లోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. గంజాయి, డ్రగ్స్‌పై ఫిర్యాదుల స్వీకరణ కోసం వారం రోజుల్లోగా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానించింది. సమాచారమిచ్చి గంజాయి, డ్రగ్స్‌ను పట్టించినవారికి నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే వీటికి బానిసలైన వారిని ఆ ఉచ్చు నుంచి బయటకు తెచ్చేందుకు మరిన్ని వ్యసన విముక్తి కేంద్రాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. జైళ్లలోనూ వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గంజాయి, డ్రగ్స్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో గురువారం తొలిసారి సమావేశమైంది. మానవవనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంబంధిత శాఖల అధికారులతో దాదాపు మూడు గంటల పాటు చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనిత, గుమ్మిడి సంధ్యారాణి విలేకర్లకు వెల్లడించారు. వంద రోజుల్లోగా వీటి నియంత్రణ, రెండేళ్లలోగా నిర్మూలన చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. వైకాపా హయాంలో రెండేళ్లపాటు గంజాయి విధ్వంసానికి కూడా అనుమతివ్వలేదని.. దీంతో విచ్చలవిడిగా లభ్యత పెరిగిందని చెప్పారు. 

సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి రాకుండా చర్యలు

  • సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి గంజాయి రాకుండా నియంత్రించేందుకు మరిన్ని చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానిస్తాం.
  • దొంగ నంబర్లతో వెళ్లే వాహనాలను గుర్తించే వ్యవస్థను తీసుకొస్తాం. అవసరమైతే ఆయా రాష్ట్రాల హోం మంత్రులు, ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం. గంజాయి రవాణా వాహనాలను గుర్తించేందుకు డాగ్‌ స్క్వాడ్‌ను కూడా సమకూర్చుకుంటాం.
  • రాష్ట్రంలో 5 వేల హెక్టార్లలో గంజాయి సాగవుతోంది. వీటిలో గంజాయి సాగే చేపట్టనీయకుండా నియంత్రించే చర్యలు తీసుకుంటున్నాం. 
  • గంజాయి స్మగ్లింగ్‌ వెనక ఉన్న అంతర్‌రాష్ట్ర, అంతర్జాతీయ ముఠాలు, కింగ్‌పిన్‌లపై నిఘా పెట్టాం. త్వరలోనే పట్టుకుంటాం.

ఏడేళ్ల బాలల సైతం గంజాయికి బానిసలే 

కొన్నిచోట్ల ఏడేళ్ల బాలలు సైతం గంజాయి తీసుకుంటున్నారు. ఇలాంటిచోట్ల పాఠశాల విద్యార్థుల బ్యాగ్‌లు పరిశీలిస్తే అందులో 30 శాతం మంది దగ్గర గంజాయి ఉంటోంది. మన్యంలో గంజాయి సాగు, అక్రమ రవాణా వెనక కింగ్‌పిన్లు ఉన్నారు. అయితే కొరియర్లుగా చిక్కి అమాయక గిరిజనులు జైల్లో మగ్గిపోతున్నారు. ఇటీవల విశాఖపట్నం జైల్లో పరిశీలించగా గంజాయి కేసుల్లో రిమాండులో ఉన్న ఖైదీల్లో దాదాపు 50 శాతం మంది 15 నుంచి 24 ఏళ్లలోపు వయసున్న గిరిజన యువకులే. కనీసం వీరికి బెయిల్‌ ఇచ్చేవారైనా లేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని