Andhra News: టెస్లాతో మళ్లీ సంప్రదింపులు

పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించింది.

Updated : 03 Jul 2024 06:46 IST

ప్రభుత్వం తరఫున లేఖ రాసిన అధికారులు
పెట్టుబడులను ఆకర్షించే చర్యలకు శ్రీకారం

ఈనాడు, అమరావతి: పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించింది. దీంతో ఎలక్ట్రానిక్‌ వాహనాల (ఈవీ) తయారీలో అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కొన్ని సంస్థలు వైకాపా ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో తమ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. వాటిలో మరెక్కడా పెట్టుబడులు పెట్టని సంస్థలను గుర్తించి, రాష్ట్రానికి రావాలంటూ వాటికి లేఖలు పంపుతున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

పదేళ్లలో కుదిరిన ఒప్పందాలపై దృష్టి

2019కి ముందు వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల్లో గత ఐదేళ్లలో ఎన్ని కార్యరూపం దాల్చాయి? మిగిలిన వాటి పరిస్థితేంటి? ఆ ఒప్పందాలు అమలు కాకపోవడానికి కారణాలేంటి అని అధికారులు విశ్లేషిస్తున్నారు. గత ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.12 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఆయా సంస్థలతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పెట్టుబడులు గ్రౌండింగ్‌ కావడానికి అడ్డంకులేంటి? వాటిని అధికారుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమేనా? ప్రభుత్వం విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందా? అనే అంశాల ఆధారంగా ఆయా సంస్థల యాజమాన్యాలతో చర్చిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల పట్ల సానుకూలంగా ఉందన్న సందేశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలన్నదే ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

ఈడీబీ దగ్గర ఉన్న లీడ్‌ల పరిస్థితేంటి? 

కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న సంస్థల వివరాలను ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఈడీబీ) సేకరించింది. సుమారు 50కి పైగా సంస్థల (లీడ్‌లు) వివరాలను ఈడీబీ సిద్ధం చేసింది. వాటిలో వెంటనే వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు అవకాశమున్న పెట్టుబడులు ఏవన్నది అధికారులు గుర్తిస్తున్నారు. ఆయా సంస్థల యాజమాన్యాలతో సత్వరమే సంప్రదింపులు జరపనున్నారు. ప్రధానంగా అరబ్‌ దేశాల నుంచి పెట్టుబడులు రావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టే సంస్థలను కూడా గుర్తించి, ఇప్పటి నుంచే వారితో చర్చలు జరుపుతామని ఓ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని