గుడ్లు, చిక్కీల గుత్తేదార్లకు రూ.178 కోట్ల బకాయిలు

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు అందించే కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేసే గుత్తేదార్లకు గత వైకాపా ప్రభుత్వం భారీగా బిల్లులను పెండింగ్‌లో పెట్టింది.

Published : 05 Jul 2024 04:36 IST

గత ప్రభుత్వ నిర్వాకంతో కొన్ని పాఠశాలలకు నిలిచిన గుడ్ల సరఫరా
మంత్రి లోకేశ్‌ సమీక్షతో వెలుగులోకి

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు అందించే కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేసే గుత్తేదార్లకు గత వైకాపా ప్రభుత్వం భారీగా బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఈ విషయం విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ సచివాలయంలో గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో వెలుగు చూసింది. కోడిగుడ్లకు గతేడాది డిసెంబరు నుంచి.. చిక్కీలకు గత ఆగస్టు నుంచి బిల్లులు చెల్లించడం లేదని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ బకాయిల కారణంగా గుత్తేదార్లు పలుచోట్ల గుడ్ల సరఫరాను నిలిపివేశారని చెప్పారు. ఈ కారణంతోనే గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఇవ్వలేదని పేర్కొన్నారు. కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు రూ.112.5 కోట్లు, చిక్కీలకు సంబంధించి రూ.66 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక కోడిగుడ్ల సరఫరా నిలిపివేశారంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేయడంపై మంత్రి లోకేశ్‌ విస్మయం వ్యక్తం చేశారు. మేనమామాలా చూసుకోవడమంటే విద్యార్థులు, చిన్నారులను అవస్థల పాలు చేయడమా..? అని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి మంత్రి ప్రశ్నించారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గుడ్లు, చిక్కీలను పంపిణీ చేయాలని.. గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన బకాయిలను త్వరలో చెల్లిస్తామని మంత్రి గుత్తేదార్లకు భరోసా ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.3,480 కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లో నిలిచిపోతున్న విషయం కూడా ఇటీవల ఉన్నత విద్యపై లోకేశ్‌ నిర్వహించిన సమీక్షలో వెలుగు చూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని