కడప-రాయచోటి ఘాట్‌లో 6 కి.మీ. సొరంగ మార్గం

కడప-రాయచోటి ఘాట్‌ రోడ్డు (గువ్వల చెరువు ఘాట్‌)లో వాహనదారుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ప్రమాదకరంగా ఉండే ఈ ఘాట్‌కు ప్రత్యామ్నాయంగా.. ఆ కొండకు సొరంగం తవ్వి, నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది.

Published : 05 Jul 2024 04:35 IST

ఆకివీడు-దిగమర్రు రహదారికి రూ. 1,200 కోట్లు
హైవేల పనులకు రూ. 4,744 కోట్లతో వార్షిక ప్రణాళికకు మోర్త్‌ ఆమోదం

ఈనాడు, అమరావతి: కడప-రాయచోటి ఘాట్‌ రోడ్డు (గువ్వల చెరువు ఘాట్‌)లో వాహనదారుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ప్రమాదకరంగా ఉండే ఈ ఘాట్‌కు ప్రత్యామ్నాయంగా.. ఆ కొండకు సొరంగం తవ్వి, నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందుకు రూ. 1,000 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 14 జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేసింది. రూ. 4,744 కోట్లతో 2024-25 వార్షిక ప్రణాళికకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్‌) ఆమోదం తెలిపింది.

  • కర్నూలు-చిత్తూరు ఎన్‌హెచ్‌లో భాగంగా కడప-రాయచోటి మధ్య ఉన్న ఘాట్‌లో 6 కి.మీ. మేర సొరంగం నిర్మించనున్నారు. నాలుగు వరసల రహదారికి వీలుగా ఒక్కటే పెద్ద సొరంగం గానీ, లేక రెండేసి వరసల రోడ్లకు రెండు సొరంగాలు గానీ తవ్వి.. రోడ్లు వేయనున్నారు. వీటికి ఇప్పటికే కన్సల్టెంట్‌ను నియమించారు. ఆ సంస్థ వివిధ చోట్ల బోర్లు వేసి, ఆ కొండలో రాయి ఎక్కడెక్కడ గట్టిగా ఉందనేది అధ్యయనం చేస్తోంది. ఇది పూర్తయ్యాక ఎలైన్‌మెంట్‌ ఖరారు చేసి, డీపీఆర్‌ సిద్ధం చేస్తారు.
  • ఆకివీడు-దిగమర్రు మధ్య 40 కి.మీ. మేర నాలుగు వరుసల రహదారిగా ఉన్నతీకరించేందుకు రూ. 1,200 కోట్లు మంజూరు చేశారు.
  • అమలాపురం-రావులపాలెం మధ్య 32 కి.మీ. మేర రెండు వరుసల ఎన్‌హెచ్‌ నిర్మాణానికి రూ. 630 కోట్లు 
  • నూజివీడు-లక్ష్మీపురం మధ్య 47 కి.మీ.లో 2/4 వరసలుగా హైవే విస్తరణకు రూ. 625 కోట్లు 
  • అరకు-బౌధార మధ్య 41 కి.మీ. రెండు వరసల రహదారి ఉన్నతీకరణకు రూ. 670 కోట్లు 
  • ఆత్మకూరు-వెలుగోడు సెక్షన్‌లో 17 కి.మీ.కు రూ. 139 కోట్లు 
  • మాచర్ల, రెంటచింతల, గురజాల బైపాస్‌లు కలిపి 10 కి.మీ.లకు రూ. 35 కోట్లు 
  • జీలుగుమిల్లి-పట్టిసీమ-కొవ్వూరు మధ్య 46 కి.మీ. మేర నిర్మించే హైవేలో భాగంగా భూసేకరణకు రూ. 50 కోట్లు కేటాయించారు.
  • ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని