జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!

వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు.

Published : 04 Jul 2024 05:27 IST

అగ్రిగోల్డ్‌ ఫుడ్స్‌ అండ్‌ ఫార్మ్స్‌ కర్మాగారంలో భారీ చోరీ
ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు

ఈనాడు, అమరావతి: వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. ఆరునెలల తర్వాత కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని ‘ఈనాడు’ దృష్టికి తెచ్చారు. అగ్రిగోల్డ్‌ ఫుడ్స్‌ అండ్‌ ఫార్మ్స్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో మాయమైన వీటి విలువ దాదాపు రూ.20 కోట్ల పైమాటే. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అగ్రిగోల్డ్‌ ఆస్తుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అగ్రిగోల్డ్‌ ఫుడ్స్‌ అండ్‌ ఫార్మ్స్‌ పేరుతో 1995లో కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో ఓ కర్మాగారాన్ని రూ.4.50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేశారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సూరంపల్లిలో ఏర్పాటుచేసిన పారిశ్రామికవాడలోనే ఈ కర్మాగారం పెట్టారు. ఇక్కడ పచ్చళ్ల మసాలాలు, పచ్చళ్లు, సుగంధద్రవ్యాల ఉత్పత్తులు, ఇన్‌స్టెంట్‌ ఫుడ్స్‌ తయారు చేసేవారు. వీటిని విదేశాలకూ ఎగుమతి చేసేవారు. తర్వాత అగ్రిగోల్డ్‌ సంస్థ దివాలా తీసింది. ఈ కర్మాగారానికి వివిధ బ్యాంకులు రుణాలిచ్చాయి. వీటిని తిరిగి రాబట్టుకునేందుకు కోర్టు ఉత్తర్వులతో యూనియన్‌ బ్యాంకు 2019 మార్చి 25న కర్మాగారాన్ని జప్తుచేసింది. ఆస్తులను వేలం వేసేందుకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నా.. వేలంలో జాప్యం చేసినట్లు తెలిసింది.

తనిఖీ లేదు.. కేసూ లేదు

తర్వాత ఈ కర్మాగారానికి తాళం వేసి ఒక సెక్యూరిటీ గార్డును పెట్టారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా కర్మాగారం లోపల యంత్రసామగ్రి, కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులను తరలించారు. ఈ విషయం అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి తెలిసి.. 2023 సెప్టెంబరు 5న గన్నవరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాటి గన్నవరం సీఐ కనకారావు కనీసం కర్మాగారాన్ని సందర్శించలేదు, సామగ్రి మాయంపై ఆరా తీయలేదు. ఫిర్యాదును పక్కన పెట్టేశారు. యూబీఐ ఎటాచ్‌ చేసిన ఆస్తులు కాబట్టి.. వాళ్లు ఫిర్యాదు చేస్తేనే కేసు పెడతామని పోలీసులు చెబుతున్నారు. యూబీఐ దీనిపై ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుత సీఐ వరప్రసాద్‌ను వివరణ కోరగా సంబంధిత యజమానులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదని చెప్పారు. 

ఉలుకూపలుకూ లేదు

అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నింటిపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. సూరంపల్లి కర్మాగారం కూడా వారి జాబితాలోనే ఉంది. మధ్యలో కోర్టు నుంచి యూబీఐ ఎటాచ్‌మెంట్‌ తీసుకుంది. అంత పెద్ద కర్మాగారంలో రూ.20 కోట్ల సామగ్రి మాయమైనా.. అధికారులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండటం విస్మయానికి గురిచేస్తోందని అగ్రిగోల్డ్‌ బాధితులు వాపోతున్నారు. దీనిపై అగ్రిగోల్డ్‌ మొదటి యజమాని ఇటీవల కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. చోరీ కేసు నమోదు చేయలేదని వ్యాజ్యం దాఖలు చేసినట్లు తెలిసింది. యూబీఐ అధికారులు వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని