ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి: మంత్రి లోకేశ్‌

విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

Published : 03 Jul 2024 04:47 IST

ఈనాడు, అమరావతి: విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఉండవల్లిలో మంగళవారం రాష్ట్రోపాధ్యాయ సంఘం నేతలు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి లోకేశ్‌ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, అధికారులు, పలు వర్గాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన సంస్కరణలు అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం కనీసం చర్చలు లేకుండా ఏకపక్షంగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు విద్యారంగంలో గందరగోళ పరిస్థితులకు దారి తీశాయని పేర్కొన్నారు. ఉత్తర్వులు-117 రద్దు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆలోచిస్తున్నామని, టీచర్లకు బోధనేతర పనిభారం లేకుండా నూతన సంస్కరణలపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. ఎలాంటి సర్వీసు సమస్యలు లేకుండా పదోన్నతులు, నియామకాలు, బదిలీలు చేపడతామని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయ వాణి మాస పత్రికను మంత్రి ఆవిష్కరించారు. మంత్రిని కలిసిన వారిలో ఎస్టీయూ అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ‘ఉపాధ్యాయ వాణి’ ప్రధాన సంపాదకులు గాజుల నాగేశ్వరరావు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని