‘ఆర్థిక’ శ్వేతపత్రం రూపకల్పనపై మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆరా

జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకంపై శ్వేతపత్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ మంగళవారం తన ఛాంబరులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్, కార్యదర్శులు వినయ్‌చంద్, జానకి తదితరులతో సమావేశమయ్యారు.

Published : 03 Jul 2024 04:46 IST

ఈనాడు, అమరావతి: జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకంపై శ్వేతపత్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ మంగళవారం తన ఛాంబరులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్, కార్యదర్శులు వినయ్‌చంద్, జానకి తదితరులతో సమావేశమయ్యారు. శ్వేతపత్రం రూపకల్పన ఎంత వరకు వచ్చిందో ఆరా తీశారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న పెండింగు బిల్లుల వివరాలపై చర్చించారు. పెండింగు బిల్లుల సమగ్ర సమాచారం తెలియజేయాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులకు సూచించారు. ఆయా శాఖల నుంచి సరైన సమాచారం అందలేదని తెలియడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విభాగాధిపతులకు మరో సర్క్యులర్‌ జారీ చేయాలని ఆదేశించారు. సమగ్ర వివరాలు సమర్పించకపోయినా, అందులో లోపాలు ఉన్నాయని తేలినా చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేయాలని మంత్రి సూచించారు.

సీఎంతోనూ అధికారుల భేటీ

ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబును కలిశారు. ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లనుండటం, ఆ పర్యటనలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌నూ కలవనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రికి నివేదించాల్సిన అంశాలపై సీఎం ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడారు. చంద్రబాబు వెంట ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సైతం వెళ్లనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని