నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ డెమో పోస్టు భర్తీ

వైద్య, ఆరోగ్యశాఖ జోన్‌-3 పరిధిలోని డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి (డెమో) పోస్టును నిబంధనలకు విరుద్ధంగా జోన్‌-4 అధికారులు భర్తీ చేయడం చర్చనీయాంశమైంది.

Published : 03 Jul 2024 04:13 IST

బరితెగించిన జోన్‌-4 ఆర్డీడీ

ఈనాడు, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖ జోన్‌-3 పరిధిలోని డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి (డెమో) పోస్టును నిబంధనలకు విరుద్ధంగా జోన్‌-4 అధికారులు భర్తీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నియామకం కారణంగా జోన్‌-3 పరిధిలో ఉండే ఉద్యోగికి తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై బాధిత ఉద్యోగి భానుమూర్తి లబోదిబోమంటున్నారు. తనకు పదోన్నతి ఇచ్చే విషయంలో అన్యాయం జరిగిందని ఆయన గతంలోనే హైకోర్టును ఆశ్రయించి ఆ పోస్టును భర్తీ చేయనీయకుండా స్టే తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలతో గత 9 నెలల పాటు ఖాళీగా ఉంచిన ఆ పోస్టును ఇటీవల కడప ప్రధాన కేంద్రంగా ఉన్న జోన్‌-4 ఆర్డీడీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రెసిడెంట్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా భర్తీ చేశారని ఆయన మండిపడుతున్నారు. ఈ పోస్టు భర్తీ వ్యవహారంలో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయం డీడీ శేషారెడ్డి మంత్రాంగం నడిపారని ఆరోపించారు. ‘నేను చాలా సీనియర్‌ అయినప్పటికీ ఇంకా హెల్త్‌ ఎడ్యుకేటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో ఉద్యోగోన్నతి కల్పనలో అన్యాయం జరిగింది. ప్రస్తుతం డిప్యూటీ డెమో పోస్టులో నేను నియమితుడిని కావాల్సిన సమయంలో ఇతరులతో భర్తీ చేశారు. నాకు అన్యాయం జరిగింది’ అని ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి భానుమూర్తి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తిరుపతి కార్యాలయంలో ఉన్న డిప్యూటీ డెమో పోస్టు జోన్‌-3 పరిధిలోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని