Chandrababu: నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు

పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

Updated : 03 Jul 2024 08:41 IST

సంక్షేమ పథకాలపై సచివాలయంలో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. చిత్రంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉన్నతాధికారులు

ఈనాడు డిజిటల్, అమరావతి: పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాట, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ‘డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. టమాట, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోంది’ అని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దాం’ అని అధికారులకు చంద్రబాబు సూచించారు.

రైతుబజార్ల నిర్వహణ సరిగా లేదు

రాష్ట్రంలోని రైతుబజార్ల నిర్వహణ సరిగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఏర్పాటు వెనుకనున్న అసలు ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తోపాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని