ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు ఇక కుదరదు

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితŸర యూపీఐ యాప్‌ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్‌ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి.

Updated : 02 Jul 2024 06:20 IST

డిస్కంల యాప్‌లు.. వెబ్‌సైట్‌లోకి వెళ్లి కట్టాల్సిందే

ఈనాడు-అమరావతి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్‌ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు సేవలను ఆ యాప్‌లు నిలిపేశాయి. ఈ నేపథ్యంలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి సంబంధిత విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కం) వినియోగదారులు మొబైల్‌ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని బిల్లులు చెల్లించాలని సూచించాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఆయా చెల్లింపు సంస్థలు జులై ఒకటో తేదీ నుంచి బిల్లుల చెల్లింపు సేవలు నిలిపేశాయి. దీంతో విద్యుత్‌ వినియోగదారులు ప్రతినెలా బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కం వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ను వినియోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిస్కంల యాప్‌/వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు. అలాగే డెబిట్, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్‌ కార్డ్స్‌ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. 

విద్యుత్‌ బిల్లులు ఇక ఇలా చెల్లించాలి

ఏపీసీపీడీసీఎల్‌: ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి central power యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. డిస్కం వెబ్‌సైట్‌ https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్‌ బిల్లులు చెల్లించాలి

ఏపీఈపీడీసీఎల్‌: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి eastern power యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. డిస్కం వెబ్‌సైట్‌ apeasternpower.com ద్వారా బిల్లులు చెల్లించాలి. 

ఏపీఎస్‌పీడీసీఎల్‌: ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి southern power యాప్‌/వెబ్‌సైట్‌ www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని