95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల్లోపు 61,76,188 మందికి, రూ.4,169.49 కోట్లు అందించాం.

Published : 02 Jul 2024 05:47 IST

1.35 లక్షల సచివాలయ సిబ్బందితోనే సాధ్యమైంది: మంత్రి పార్థసారథి 

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల్లోపు 61,76,188 మందికి, రూ.4,169.49 కోట్లు అందించాం. రాత్రి వరకూ కొందరు సచివాలయ సిబ్బంది యజ్ఞంలా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు’ అని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వడానికే కష్టంగా ఉన్నప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు అందించామని తెలిపారు. విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం రాత్రి మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘ఒకే రోజులో ఈ స్థాయిలో పంపిణీ చేయడం రికార్డుగా భావిస్తున్నాం. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ ఇంత వేగంగా ఎన్నడూ పంపిణీ చేయలేదు. కేవలం 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఒక్క రోజులోనే ఈ విజయం సాధించాం’ అని పేర్కొన్నారు. ‘సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు స్ఫూర్తిదాయకంగా పని చేస్తారనడానికి ఇదే ఉదాహరణ. ఇంత మంచి వ్యవస్థ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లు లేకుంటే పింఛన్ల పంపిణీ సాధ్యం కాదంటూ వృద్ధుల ప్రాణాలు బలిగొంది’ అని విమర్శించారు.

జగన్‌ కుదరదంటే.. చంద్రబాబు చేసి చూపించారు: ఎమ్మెల్యే ఏలూరి 

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ కుదరదని చెప్పగా, మా ప్రభుత్వం మొదటి రోజే రికార్డు స్థాయిలో వారితో పింఛన్లు పంపిణీ చేయించిందని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించాక, సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ అందించే అవకాశం ఉన్నప్పటికీ జగన్‌ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో పింఛన్‌దారులను ఇబ్బంది పెట్టింది. మండుటెండలో వృద్ధులు, దివ్యాంగులను బ్యాంకులు, సచివాలయాల వద్ద నిల్చోబెట్టి 60 మంది ప్రాణాలను బలిగొంది. చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ఓ పండుగలా నిర్వహిస్తోంది. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీల అమలుకు తొలి రోజు నుంచే కృషి చేస్తోంద’ని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని