రేషన్‌ బియ్యాన్ని నూకలుగా మార్చి ఎగుమతి!

కాకినాడలో రేషన్‌ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదల బియ్యాన్ని నూకలుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రెండు రోజులుగా పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన దాడుల్లో బట్టబయలైంది.

Published : 02 Jul 2024 05:45 IST

గోదాముల్లోని నిల్వల్లో ఫోర్టిఫైడ్‌ గింజల ఆనవాళ్లు
కాకినాడ సమీప ప్రాంతాల్లో 15 వేల టన్నుల సీజ్, 9 కేసుల నమోదు

శ్రీ శ్రీనివాస్‌ ట్రేడింగ్‌ కంపెనీలో బియ్యం నిల్వలను పరిశీలిస్తున్న అధికారులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కాకినాడలో రేషన్‌ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదల బియ్యాన్ని నూకలుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రెండు రోజులుగా పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన దాడుల్లో బట్టబయలైంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇటీవల రెండు రోజుల పాటు కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని గోదాములపై దాడులు నిర్వహించి రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. 13,990 టన్నుల మేర స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక బృందాలు తనిఖీలు కొనసాగించాయి. ఆదివారం కాకినాడ గ్రామీణ మండలం కొవ్వూరు రోడ్డులోని శ్రీ శ్రీనివాస్‌ ట్రేడింగ్‌ కంపెనీలో రూ.3.84 కోట్ల విలువైన 1,406 టన్నుల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు. ఇక్కడ నూకలు, బియ్యం పట్టుబడ్డాయి. నూకలను పరిశీలించగా రేషన్‌ బియ్యంలో కలిపే ఫోర్టిఫైడ్‌ గింజలను గుర్తించారు. వీటి కారణంగా రేషన్‌ బియ్యాన్ని సులభంగా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 12 గోదాముల్లో తనిఖీలు చేసి రూ.43.43 కోట్ల విలువైన 15,396 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, 9 కేసులు నమోదు చేశారు. మరోవైపు కాకినాడ పోర్టు ప్రాంతంలో సోమవారం మూడు ప్రత్యేక బృందాలు నాలుగు గోదాముల్లో తనిఖీలు నిర్వహించాయి. వీటిలో ఎక్కడా బియ్యం నిల్వలు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. వైకాపా ఓడిపోయిన తరువాత ఎగుమతిదారులు రేషన్‌ బియ్యాన్ని వేరే ప్రాంతాలకు తరలించినట్లు అనుమానిస్తున్నారు. కాకినాడ, పిఠాపురం పరసర ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల నుంచి రేషన్‌ బియ్యం దిగుమతి అవుతున్నాయి. ఇక్కడున్న కొన్ని రైస్‌మిల్లుల్లో వాటిని నూకలుగా మార్చి పోర్టు ద్వారా ఎగుమతి చేసేవారికి అందజేస్తున్నారు. రైస్‌ మిల్లులపై కూడా దృష్టి సారిస్తే మరిన్ని అక్రమ నిల్వలు పట్టుబడే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని