స్తంభించిన దేవాదాయశాఖ వెబ్‌సైట్‌

దేవాదాయశాఖకు చెందిన వెబ్‌సైట్‌ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో వివిధ ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, పూజలు తదితరాలకు ఆన్‌లైన్‌లో ముందే టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు.

Published : 02 Jul 2024 05:43 IST

సర్వర్‌ క్రాష్‌ కావడంతో 28 గంటలు గందరగోళం
సోమవారం రాత్రి మళ్లీ అందుబాటులోకి

ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖకు చెందిన వెబ్‌సైట్‌ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో వివిధ ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, పూజలు తదితరాలకు ఆన్‌లైన్‌లో ముందే టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు. ఆలయాల్లో దర్శనాలకు ఆన్‌లైన్‌ టికెట్ల జారీకీ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయా ఆలయాల అధికారులు పాత విధానంలో ముద్రిత టికెట్లు జారీ చేశారు. 28 గంటల అనంతరం సోమవారం రాత్రి 8 గంటలకు వెబ్‌సైట్‌ మళ్లీ అందుబాటులోకి వచ్చింది.

ఏపీ టీఎస్‌ను కాదని..

ప్రస్తుతం దేవాదాయశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్‌ను నైన్‌ అండ్‌ నైన్‌ అనే సంస్థ అభివృద్ధి చేసి రెండేళ్లుగా నిర్వహిస్తోంది. డిజిటల్‌ ఓషన్‌ అనే క్లౌడ్‌ సర్వర్‌లో డేటా ఉంచుతోంది. ఆ క్లౌడ్‌ సర్వర్‌ ఆకస్మికంగా క్రాష్‌ కావడంతో దేవాదాయశాఖ వెబ్‌సైట్‌ ఆదివారం పనిచేయకుండా పోయింది. కొంతకాలంగా నైన్‌ అండ్‌ నైన్‌ అందిస్తున్న సేవల్లో తరచూ ఇదే విధంగా సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో దేవాదాయశాఖ వెబ్‌సైట్‌ నిర్వహణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీ టీఎస్‌) చూసేది. ఇందుకు ఎటువంటి రుసుము తీసుకోలేదు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక నిర్వహణకు రుసుం చెల్లించాలంటూ ఏపీ టీఎస్‌ పట్టుబట్టింది. ఇదే సమయంలో నైన్‌ అండ్‌ నైన్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద దేవాదాయశాఖకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఉచితంగా నిర్వహిస్తామని ముందుకు రావడంతో అధికారులు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే తరచూ సమస్యలు వస్తుండటంతో.. టెండర్లు నిర్వహించి, ఎంపికయిన సంస్థకు వెబ్‌సైట్‌ నిర్వహణ బాధ్యతలు ఇచ్చేందుకు చూస్తున్నట్లు దేవాదాయశాఖ వర్గాలు తాజాగా తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని