దివ్యాంగురాలి పింఛను పునరుద్ధరణ

నిబంధనల పేరుతో గత వైకాపా ప్రభుత్వం ఓ దివ్యాంగురాలికి నిలిపివేసిన పింఛన్‌ను.. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం పునరుద్ధరించి ఆమె జీవితంలో వెలుగులు నింపింది.

Updated : 02 Jul 2024 06:33 IST

నిబంధనల పేరుతో తొలగించిన గత వైకాపా ప్రభుత్వం
అధికారంలోకి రాగానే కొనసాగిస్తామని చంద్రబాబు హామీ
ఈ మేరకు ఇంటికెళ్లి పింఛను ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర

ఎన్టీఆర్‌ భరోసా కింద పర్వీన్‌కు రూ.15 వేల పింఛను అందజేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ బాలాజీ

మచిలీపట్నం కలెక్టరేట్, న్యూస్‌టుడే: నిబంధనల పేరుతో గత వైకాపా ప్రభుత్వం ఓ దివ్యాంగురాలికి నిలిపివేసిన పింఛన్‌ను.. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం పునరుద్ధరించి ఆమె జీవితంలో వెలుగులు నింపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నూరుద్దీన్‌పేటకు చెందిన ఇదయతుల్లాఖాన్, అమీరున్నీసా దంపతుల కుమార్తె సీమాపర్వీన్‌ పుట్టుకతోనే వందశాతం దివ్యాంగురాలు. మంచానికే పరిమితమైన ఆమె సంరక్షణ.. నిరుపేదలైన తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛను ఆ కుటుంబానికి ఆర్థికంగా కాస్త ఆసరా కల్పించేది. వైకాపా అధికారంలోకి వచ్చాక విద్యుత్తు బిల్లు ఎక్కువగా వచ్చిందన్న సాకుతో 2021 నుంచి పింఛను నిలిపివేశారు. కాస్తోకూస్తో వచ్చే ఆర్థికసాయం నిలిచిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది.

సీమాపర్వీన్‌ పింఛను నిలిపివేయడంతో వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గతంలో ఆమెతో సెల్ఫీ దిగిన చంద్రబాబు 

ఈ విషయాన్ని గత ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నానికి వచ్చిన చంద్రబాబు దృష్టికి స్థానిక తెదేపా నేతలు తీసుకువెళ్లారు. ఎటూ కదలలేని స్థితిలో ఉన్న పర్వీన్‌ను చూసి ఆయన చలించిపోయారు. ఆమె పింఛను నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్వీన్‌తో సెల్ఫీ దిగి.. ఇదేనా సంక్షేమం అంటూ వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆమె కుటుంబానికి తక్షణ సాయంగా రూ.36,000 చెక్కు ఇవ్వడంతో పాటు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు పార్టీ పరంగా ప్రతి నెల రూ.3000 అందజేస్తామని చెప్పారు. అలా జూన్‌ వరకు స్థానిక తెదేపా నేతల సహకారంతో ఆర్థికసాయం అందించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సోమవారం ఆమె ఇంటికి వెళ్లి రూ.15,000 పింఛను ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని