స్వగ్రామాలకు వీర సైనికుల పార్థివదేహాలు

లద్దాఖ్‌ వద్ద శ్యోక్‌ నదిని దాటుతుండగా.. ఆకస్మికంగా వచ్చిన వరదకు దౌలత్‌బేగ్‌ ఓల్డీ సైనిక స్థావరానికి చెందిన యుద్ధ ట్యాంకర్‌ శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 02 Jul 2024 04:35 IST

విజయవాడ విమానాశ్రయంలో నివాళి

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తరఫున వీరసైనికుల భౌతికకాయాలకు నివాళులర్పిస్తున్న ఏడీసీ మేజర్‌ దీపక్‌శర్మ

గన్నవరం గ్రామీణం, రేపల్లె అర్బన్, పెడన, న్యూస్‌టుడే: లద్దాఖ్‌ వద్ద శ్యోక్‌ నదిని దాటుతుండగా.. ఆకస్మికంగా వచ్చిన వరదకు దౌలత్‌బేగ్‌ ఓల్డీ సైనిక స్థావరానికి చెందిన యుద్ధ ట్యాంకర్‌ శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్ల పార్థివదేహాలను గ్వాలియర్‌ విమానాశ్రయం నుంచి వాయుసేన విమానంలో సోమవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. వీర సైనికులు సాదరబోయిన నాగరాజు (కృష్ణా జిల్లా, పెడన మండలం, చేవెండ్ర), ఆర్‌.కృష్ణారెడ్డి (ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, రేచర్ల), సుభాన్‌ఖాన్‌ (బాపట్ల జిల్లా, ఇస్లాంపూర్‌) భౌతికకాయాలకు గన్‌ సెల్యూట్, పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తరఫున ఏడీసీ మేజర్‌ దీపక్‌శర్మ నివాళి అర్పించారు. బ్రిగేడియర్‌ వి.వెంకట్‌రెడ్డి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ సందీప్‌యాదవ్, మేజర్‌ సుధీర్‌శర్మ, ఏవోసీ సికింద్రాబాద్‌ కేంద్ర కెప్టెన్‌ దీపక్‌బాణి, నాయుబ్‌సుబిదార్‌ జీడీరెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ఆర్మీ వాహనాల్లో జవాన్ల పార్థివదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఇస్లాంపూర్‌ గ్రామస్థులు జాతీయ జెండాలతో ఊరేగింపుగా సుభాన్‌ఖాన్‌ పార్థివదేహాన్ని ఆయన ఇంటి వద్దకు తీసుకొచ్చారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తదితరులు సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మరో అమర సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివదేహానికి రాత్రి 9 గంటలకు ఆయన స్వగ్రామం చేవేండ్రలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ తదితరులు నివాళులర్పించారు. ప్రజలు భారీగా తరలివచ్చారు. 

సైనికుల మృతి కలచివేసింది: సీఎం చంద్రబాబు

లద్దాఖ్‌ వద్ద జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు సైనికులు చనిపోయిన ఘటన తనను కలచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఎక్స్‌ వేదికగా సోమవారం ఆయన నివాళి అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని