మహిళలు, చిన్నారులపై నేర ఘటనల్లో కఠిన శిక్షలకు వీలుగా బీఎన్‌ఎస్‌

బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) చట్టం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు అన్నారు.

Updated : 02 Jul 2024 04:26 IST

సత్వర న్యాయం ఈ చట్టం ద్వారా సాధ్యం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

కార్యక్రమంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు. చిత్రంలో ఏపీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, ప్రధాన కార్యదర్శి ఎన్‌.శ్రీహరి

ఈనాడు, అమరావతి: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) చట్టం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు అన్నారు. నేరగాళ్లను సంస్కరించే విధంగా కొత్త చట్ట నిబంధనలు ఉన్నాయన్నారు. బీఎన్‌ఎస్‌లో సుమారు 14 నుంచి 15 కొత్త సెక్షన్లను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన బీఎన్‌ఎస్, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ నవజాత శిశువుల్లాంటివని అభిప్రాయడ్డారు. సమాజ అవసరాలకు అనుగుణంగా చట్టాలు మారుతుంటాయని, న్యాయవాదులు వాటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైకోర్టులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు హాజరై సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన బీఎన్‌ఎస్‌ చట్టం గురించి న్యాయవాదులకు అవగాహన కల్పించారు.  

సామాజిక సేవ కింద శిక్షకు అవకాశం

ఐపీసీలో మొత్తం 511 సెక్షన్లు ఉన్నాయని, దాని స్థానంలో తీసుకొచ్చిన బీఎన్‌ఎస్‌లో 358 సెక్షన్లు మాత్రమే ఉన్నాయని జస్టిస్‌ దుర్గాప్రసాదరావు గుర్తుచేశారు. ఐపీసీలోని నిర్వచనాలన్నింటినీ కొత్త చట్టంలో ఏకం చేయడం, కొన్ని సెక్షన్లను తొలగించడంతో కొత్త చట్టంలో సెక్షన్లు తగ్గాయన్నారు. ఐపీసీలో ఐదు రకాల శిక్షల విధింపునకు వీలుందని, వీటితోపాటు బీఎన్‌ఎస్‌లోని 202, 209, 226, 303(2), 355, 356 సెక్షన్లకు ‘కమ్యూనిటీ సర్వీసు’ (సామాజిక సేవ) కింద శిక్ష విధించేందుకు వీలుకల్పించారన్నారు. సామాజిక సేవ అంటే ఏమిటో బీఎన్‌ఎస్‌ చట్టంలో నిర్వచించకపోవడం చర్చించదగ్గ విషయమన్నారు.

వ్యవస్థీకృత నేరాలకు కఠిన శిక్షలు

చైన్‌ స్నాచింగ్, సామూహికంగా దాడి చేయడం ద్వారా పరువు హత్యలకు పాల్పడడం, భూ ఆక్రమణ, కిడ్నాప్, దోపిడీలు, వాహనాల దొంగతనం, వ్యభిచారం కోసం మానవ అక్రమ రవాణ తదితర వ్యవస్థీకృత నేరాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు పలు సెక్షన్లు తీసుకొచ్చారన్నారు. వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక వాంఛను తీర్చుకునే వారిని బోనులో నిలబెట్టేందుకు సెక్షన్‌ 69ని కొత్తగా ప్రవేశపెట్టారని తెలిపారు.

  • ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఐపీసీ సెక్షన్‌ 309 కింద నేరమని, ఈ సెక్షన్ను తొలగించి బీఎన్‌ఎస్‌లో కొత్త కోణంలో సెక్షన్‌ 226 తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఫలాన పనిచేయాలని బలవంతపెట్టేందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడతామని బెదిరిస్తే ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవ శిక్ష విధించేందుకు సెక్షన్‌ 226 వీలు కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం, ప్రధాన కార్యదర్శి శ్రీహరి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని