వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్‌ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు.

Published : 01 Jul 2024 04:46 IST

నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ తీరిది

ఈనాడు, అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్‌ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. వర్సిటీలో కోట్ల విలువైన పలు సివిల్‌ పనులను నామినేషన్‌ ప్రాతిపదికన వైకాపా నాయకుడైన ఓ గుత్తేదారుకు కట్టబెట్టి వర్సిటీ సొమ్మును దోచిపెట్టారు. 

అప్పటి మంత్రి అనుయాయుడని..

గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన మేరుగు నాగార్జున అనుయాయుడైన కందుల రాజశేఖర్‌కు చెందిన కందుల ఇన్‌ఫ్రా కంపెనీకి వర్సిటీలో టెండర్లు లేకుండా రూ.7-8 కోట్ల పనులు అప్పగించారు. నామినేషన్లపై పనుల నిర్వహణ అంటేనే బోలెడు లాభాలు అన్నది జగమెరిగిన సత్యం. ఈ కంపెనీ గతంలో వర్సిటీలో పనులు చేసిన దాఖలాలు లేవు. టెండర్లలో పనులు దక్కించుకునేవారికి మొండిచేయి చూపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చారు. ఆ గుత్తేదారు చేసిన పనుల్లో ఎన్నో లొసుగులు బయటపడతాయి. అవేమీ పట్టించుకోకుండా వర్సిటీ ఇంజినీరింగ్‌ విభాగం బిల్లుల చెల్లింపునకు సిఫార్సులు చేసింది.

విచారణ చేయిస్తే గుట్టురట్టు

కోట్ల విలువ చేసే పనుల్ని ముక్కలుగా చేసి నామినేషన్లపై ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో విచారణ చేయిస్తే లోగుట్టు వెలుగుచూస్తుంది. ఉపకులపతికి గరిష్ఠంగా రూ.15లక్షల వరకే అనుమతి ఉంటుంది. ఆపై విలువ చేసే పనులకు వర్సిటీ పాలక మండలి ఆమోదం తీసుకోవాలి. అదేమీ లేకుండానే రూ.కోట్ల విలువైన పనులను వీసీ కేటాయించడం ప్రశ్నార్థకమవుతోంది. ఔ

  • వర్సిటీలో సెప్టిక్‌ ట్యాంకులు, సైడు కాల్వలు, తరగతి గదుల్లో ఫాల్స్‌ సీలింగ్, పార్టిషన్స్, గ్రంథాలయ భవనంలో ఆధునికీకరణ, ఫ్లోరింగ్‌ పనులు, సెమినార్‌ హాళ్ల వంటివి ఎక్కువగా ఈ సంస్థే చేసింది. 
  • వర్సిటీ జనరల్‌ ఫండ్, రూసా నిధులు, ఇంజినీరింగ్‌ కాలేజీ నిధులు, డెవలప్‌మెంట్‌ అకౌంట్, దూరవిద్య విభాగం నుంచి బిల్లులు చెల్లించారు. దీనిపై వర్సిటీ ఫైనాన్స్‌ అధికారులను వివరణ కోరగా ఇప్పటివరకు రూ.3-4 కోట్ల వరకు చెల్లించామని, ఇంకా చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయని తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని