నేటి నుంచి ‘స్టాప్‌ డయేరియా’ రెండో దశ

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్‌ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Published : 01 Jul 2024 04:39 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్‌ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై అన్ని స్థాయుల ఆసుపత్రులతో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రాణాంతకంగా మారుతున్న అతిసారాన్ని నిరోధించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘స్టాప్‌ డయేరియా’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా పిల్లలకు రెండు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు 14 రోజులకు సరిపడా జింక్‌ మాత్రలు ఇస్తారు. అతిసారం నివారణపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు రెండు నెలల పాటు ప్రచార కార్యక్రమాలు చేపడతారు. అతిసారం ప్రబలడానికి కారణాలను గుర్తించడంతోపాటు ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేయడం, స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తేవడం, పోషకాహార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు. దీనిలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పట్టణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు భాగస్వామ్యం అవుతాయి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జింక్‌ మాత్రలను ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోల ద్వారా పంపిణీ చేయించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని