పదవి కాదు.. బాధ్యత

‘ఎంతో కీలకమైన పదవి ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తా’ అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

Published : 30 Jun 2024 05:44 IST

సభాపతిగా నియామకంపై అయ్యన్నపాత్రుడు

స్పీకర్‌ అయ్యన్నకు నూకాలమ్మ చిత్రపటం అందిస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ‘ఎంతో కీలకమైన పదవి ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తా’ అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సభాపతిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా శనివారం అనకాపల్లి జిల్లాకు వచ్చారు. ముందుగా ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ అధికారులు, పురోహితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అయ్యన్నకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఆలయ పనులను అయ్యన్న పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నూకాలమ్మ దేవస్థానం పునర్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గడిచిన ఐదేళ్లు పనులు నత్తనడకన సాగాయి. మళ్లీ చంద్రబాబే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రారంభిస్తారు. శాసనసభను హుందాగా నడిపేందుకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా అమ్మవారిని కోరుకున్నా’ అని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత, ఈవో బండారు ప్రసాద్‌ స్పీకర్‌ వెంట ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు