తిరుమలలోని శారదా పీఠం భవనాలు సీజ్‌ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్‌ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్‌ చేశారు.

Published : 30 Jun 2024 05:42 IST

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసానంద సరస్వతి. చిత్రంలో ఏపీ సాధుపరిషత్‌ సభ్యులు

ఈనాడు డిజిటల్, తిరుపతి-తిరుపతి భవానీనగర్, తిరుమల, న్యూస్‌టుడే: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్‌ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు ఎనభై అడుగుల విస్తీర్ణంలో ఉన్న వాగును అరవై అడుగుల వరకు ఆక్రమించి అడ్డదారిలో అనుమతులు తెచ్చుకొని భవనాలు నిర్మించారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో వరద నీరంతా శారదా పీఠంలోకి వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల భక్తుల ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో కల్తీ ఆహారం, అక్రమ కట్టడాలపై తితిదే అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు భోజనం, వసతి, యజ్ఞాలు నిర్వహించుకునేందుకు వీలుగా తితిదే పలు మఠాల నిర్మాణం కోసం స్థలాలు ఇస్తే, విశాఖ శారదా పీఠం వంటి మఠాలు మాత్రం వాటిపేరుతో వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించారు.

హైకోర్టు పరిధిలో శారదాపీఠం అదనపు నిర్మాణాల అంశం: తితిదే

తిరుమలలో మఠం నిర్మించుకోవడానికి విశాఖ శారదాపీఠానికి ఐదువేల చదరపు అడుగుల స్థలాన్ని తితిదే లీజుకు ఇచ్చిందని, 2005 ఫిబ్రవరిలో 30 సంవత్సరాలపాటు స్థలం లీజుకు ఇవ్వడానికి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని తితిదే శనివారం ప్రకటనలో పేర్కొంది. తిరుమలలో అనుమతులకు మించి శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తితిదే స్పందించింది. శ్రీశారదా మఠానికి పక్కనే ఉన్న 4817 చదరపు అడుగుల స్థలాన్ని కూడా శారదాపీఠం వినియోగించుకుందని, 2019లో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి క్రమబద్ధీకరించుకుందని వెల్లడించింది. అక్రమ నిర్మాణాల వివాద అంశం ఏపీ హైకోర్టు పరిధిలో ఉందని తితిదే పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని