మా భవనాలపై దాడులు జరగకుండా నియంత్రించండి

వైకాపా కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలపై దాడులు జరపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని గవర్నర్‌కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు.

Published : 30 Jun 2024 05:41 IST

గవర్నర్‌కు వైకాపా ప్రతినిధుల బృందం విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: వైకాపా కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలపై దాడులు జరపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని గవర్నర్‌కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై తెదేపా, జనసేన నేతల ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయని, వాటిని నిలువరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. 

నిబంధనల ప్రకారమే కేటాయింపులు: ‘నిబంధనల ప్రకారమే వైకాపా కార్యాలయాల కోసం స్థలాలు కేటాయించుకుని వాటిలో నిర్మాణాలు చేపట్టాం. ఈ భవనాల్లోకి తెదేపా, జనసేన నేతలు అక్రమంగా ప్రవేశించి కూల్చేయిస్తామంటూ బెదిరిస్తున్నారు’ అని సుబ్బారెడ్డి తెలిపారు. 

18 భవనాలు పూర్తయ్యాయి: ‘2014-19 మధ్య చంద్రబాబు హయాంలో ఇచ్చిన జీఓ ఆధారంగా వైకాపా కార్యాలయాల కోసం 33ఏళ్ల లీజుకు భూములు కేటాయించుకున్నాం. నిబంధనల ప్రకారమే భవన నిర్మాణాలు చేస్తున్నాం. ఒక్కో భవనానికి రూ.2 నుంచి రూ.3 కోట్లవుతుంది. ఇప్పటికి 17 లేదా 18 భవనాలు పూర్తయ్యాయి. ఈ భవనాలేవీ అక్రమ నిర్మాణాలు కావు’ అని అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని