జోగి కుటుంబం కబ్జాపై డీజీపీకి నివేదిక

అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేష్‌ కుటుంబం పాత్రపై డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక నివేదిక చేరింది.

Published : 30 Jun 2024 05:40 IST

- పక్కా ప్లాన్‌ ప్రకారమే అగ్రిగోల్డ్‌ భూముల ఆక్రమణ 

ఈనాడు, అమరావతి: అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేష్‌ కుటుంబం పాత్రపై డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక నివేదిక చేరింది. దీనిపై దర్యాప్తు సీఐడీ చేయాలా.. లేదా అనిశా చేయాలా అన్న విషయమై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. డీజీపీ ద్వారకాతిరుమలరావు ఆదేశాల మేరకు విజయవాడ రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేశారు. సీఐడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్‌ భూములను కాజేసేందుకే అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. రమేష్‌ కుమారుడు రాజీవ్, బాబాయ్‌ జోగి వెంకటేశ్వరరావు ఆ భూమిలోకి చొరబడి వైకాపా కార్పొరేటర్‌ కుటుంబానికి విక్రయించారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే..

విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం పరిధిలోని సర్వే నంబరు 87లో అవ్వా వెంకటశేషు నారాయణరావు కుటుంబం 2002లో 206.55,  205.50 గజాల స్థలాలను కొనుగోలు చేసింది. అదేపంచాయతీ పరిధిలోని సర్వేనంబరు 88లో ఎకరం స్థలాన్ని పోలవరపు మురళీమోహన్‌ 2001లో కొని, ప్లాట్లుగా అమ్మేశారు. ఇందులో 3,800 గజాల స్థలాన్ని 2014లో అడుసుమిల్లి రామమోహన్‌దాస్‌కు విక్రయించారు. ఈయన 2022లో మాజీమంత్రి  జోగి రమేష్‌ కుటుంబసభ్యులకు అమ్మారు. ఇక్కడే అసలు నాటకం మొదలైంది. తాము కొన్న భూమి సర్వేనంబరు 88లో లేదనీ, 87లో ఉందంటూ రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సవరణ పేరుతో జోగి కుటుంబం మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. ఈ స్థలాన్ని విజయవాడ 42వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ కుటుంబసభ్యులకు అమ్మేశారు. అదే సర్వే నంబరులో అవ్వా వెంకటశేషు నారాయణరావు, ఆయన కుటుంబసభ్యుల స్థలం ఉండడంతో వివాదం రేగింది. పైగా ఇది సీఐడీ ఎటాచ్‌మెంట్‌లో ఉంది. ఈ స్థలంలో కొందరు ప్రహరీ నిర్మించారని గత జనవరిలో అవ్వా వెంకటశేషు నారాయణరావు రెండో పట్టణ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని తహసీల్దారుకు పోలీసులు లేఖ రాశారు. జోగి కుటుంబం కబ్జా నిజమేనని విజయవాడ గ్రామీణ తహసీల్దారు నివేదిక సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు