కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్‌ టెర్మినల్‌ పునరుద్ధరించాలి

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటెయినర్‌ టెర్మినల్‌ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రాణాలిచ్చేందుకూ వెనుకాడమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

Published : 29 Jun 2024 06:35 IST

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

కంటెయినర్‌ టెర్మినల్‌ను పరిశీలిస్తున్న సోమిరెడ్డి, ఇతర పార్టీల నాయకులు 

ఈనాడు, నెల్లూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటెయినర్‌ టెర్మినల్‌ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రాణాలిచ్చేందుకూ వెనుకాడమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తెదేపా, భాజపా, జనసేన, సీపీఐ నాయకులతో కలిసి కృష్ణపట్నంలోని కంటెయినర్‌ పోర్టును పరిశీలించారు. సమస్యలపై అక్కడి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ ఏపీ మారిటైం బోర్డు పర్యవేక్షణలోని పోర్టు నుంచి కంటెయినర్‌ టెర్మినల్‌ తరలిపోతున్నా.. అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నోరు విప్పలేదు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి అక్రమ టోల్‌గేటు తెరవడం, దౌర్జన్యాలు తదితర కారణాలతోనే అదానీ టెర్మినల్‌ను తమిళనాడుకు తరలించేశారు. కృష్ణపట్నంలో కంటెయినర్‌ టెర్మినల్‌ తరలిపోవడంతో రైతులకు సంబంధించిన రొయ్యలు, చేపలు, మిర్చి, పొగాకుతో పాటు గ్రానైట్‌ తదితర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. తమిళనాడులోని పోర్టులకు ఆ ఉత్పత్తులను తరలించేందుకు రవాణా ఖర్చులు రైతులకు భారంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సాయం కావాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించి అందిస్తాం. పోర్టును నమ్ముకున్న ప్రజలు, రైతులు, ఉద్యోగాలు కోల్పోయిన యువత కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకునేందుకూ సిద్ధంగా ఉన్నాం. అయినా.. పునరుద్ధరించకపోతే, ప్రాణాలిచ్చేందుకూ వెనుకాడం’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు. కంపెనీలన్నీ తిరిగి కార్యకలాపాలు కొనసాగించి పోర్టుకు పూర్వవైభవం తేవాలని, అక్కడ పనిచేసే కూలీలకు కనీస వేతనం అందించాలని సీఈఓ జీజేరావును కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని