వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థీకృత రేషన్‌ మాఫియా

‘‘కాకినాడలో వ్యవస్థీకృత రేషన్‌ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వం రూ.39కి కిలో బియ్యం అందిస్తుంటే.. పేదల వద్ద రూ.7కి కొనుగోలు చేశారు.

Published : 29 Jun 2024 06:27 IST

ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా అధికారుల తీరు
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ధ్వజం

కాకినాడలోని సార్టెక్స్‌ ఇండియా గోదాములో బియ్యం పరిశీలిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, కాకినాడ: ‘‘కాకినాడలో వ్యవస్థీకృత రేషన్‌ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వం రూ.39కి కిలో బియ్యం అందిస్తుంటే.. పేదల వద్ద రూ.7కి కొనుగోలు చేశారు. కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి రూ.వేల కోట్లు ఆర్జించారు. ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో దోపిడీకి పాల్పడ్డారు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో బియ్యం గోదాములు, మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి విలేకర్లతో మాట్లాడారు. ‘ఇటీవల 251 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నిల్వలు పరిశీలిస్తే 189 చోట్ల తేడాలు గుర్తించాం. సరకులు అందించిన వారిపై 19 కేసులు నమోదు చేసి బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాం. శుక్రవారం పది చోట్ల ఆకస్మిక తనిఖీలు చేస్తే ఏడు చోట్ల రీసైక్లింగ్‌ బియ్యం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాం. అక్రమాల వెనుక ఉన్నవారి పేర్లు శనివారం వెల్లడిస్తాం. సమగ్ర విచారణ జరిపి అందరిపై చర్యలు తీసుకుంటాం. ద్వారంపూడి అక్రమాలకు అధికారులు ఇన్నిరోజులు సహకరించారు. ఇకపై అలాగే వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’ అని నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు. 


రూ.36,300 కోట్ల అప్పులు చేసి.. 

‘పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా వైకాపా ప్రభుత్వం రూ.36,300 కోట్లు అప్పులు చేసింది. రైతులకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయింది. రాష్ట్రంలో 4.47 కోట్ల మంది రేషన్‌ కార్డుదారులు పౌరసరఫరాల వ్యవస్థపై నమ్మకంతో ఉన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం వెల్లడిస్తాం. వ్యవసాయ రంగాన్ని నిలబెట్టి, కౌలు రైతులకు మేలు చేస్తాం’ అని నాదెండ్ల మనోహర్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని