ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన భువనేశ్వరి

నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌.

Updated : 29 Jun 2024 12:24 IST

విద్యార్థులతో కలిసి భోజనం

విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న నారా భువనేశ్వరి

చల్లపల్లి, న్యూస్‌టుడే: నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌. 400 మందికిపైగా అనాథలు, పేద పిల్లలకు అమ్మానాన్న అన్నీ తానై చదివిస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం పాఠశాలలో కనిపించేసరికి విద్యార్థులు, సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. భువనేశ్వరి పిల్లలతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత దివంగత నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఇటీవల పదో తరగతిలో భవఘ్నిసాయి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం సంతోషదాయకమని అన్నారు. 1997లో చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రారంభించారని చెప్పారు. హైదరాబాద్‌లోని గండిపేటలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైస్కూల్, మహిళా కళాశాల, కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులో హైస్కూల్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న తెదేపా కార్యకర్తల పిల్లలకు విద్య బోధిస్తున్నామని చెప్పారు. ఇంతవరకూ 6,500 మంది విద్యార్థులు చదువు పూర్తిచేసుకొని బయటకు వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. వైద్య సేవలు అందుబాటులో లేని ఏజెన్సీ ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సంజీవని క్లినిక్‌ ప్రారంభించామని, కుప్పంలో మహిళల స్వయం ఉపాధికి మూడు నెలల కాల వ్యవధితో టైలరింగ్‌ శిక్షణ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీవోవో అడుసుమిల్లి గోపి, ప్రిన్సిపల్‌ మధుసూదనరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని