గత సర్కారు నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వంపై చక్కదిద్దే భారం

గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది.

Published : 29 Jun 2024 06:19 IST

బడుల్లో మౌలిక సదుపాయాల పనులకు రూ.వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్‌
నిర్మాణ సామగ్రి సరఫరా ఆపేసిన గుత్తేదార్లు 
అసంపూర్తి తరగతి గదులతో ఇబ్బందులు

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. మాజీ సీఎం జగన్‌ ఐదేళ్లపాటు పనులు చేస్తున్నట్లు ప్రచారం చేయడం తప్ప వాటిని పూర్తి చేయలేదు. మూడు విడతల్లో అన్ని పాఠశాలల్లో మౌలికసదుపాయాలు కల్పిస్తామంటూ గొప్పగా ప్రకటనలు చేసి, రెండో విడత పనులనే అసంపూర్తిగా వదిలేశారు. 2021 ఆగస్టు 16న ప్రారంభించిన రెండో విడత పనులను రెండున్నరేళ్లకుపైగా సాగదీసి, మధ్యలో వదిలేశారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదుల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటి కోసం తీసుకొచ్చిన సామగ్రిని పాఠశాలల ఆవరణల్లో ఎక్కడపడితే అక్కడ పడేశారు. కొన్నిచోట్ల సామగ్రిని తరగతుల్లో భద్ర పరచడంతో గదుల కొరత నెలకొంది. ఇప్పుడు ఈ అసంపూర్తి పనులను కొత్త ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల ముందు తమకు కావాల్సిన గుత్తేదారులకు దోచిపెట్టిన జగన్‌ ప్రభుత్వం ఈ పనుల బిల్లులను పెండింగ్‌లో పడేసింది. పనులు పూర్తి చేయించడంతోపాటు సామగ్రి కొనుగోలుకు నిర్వహించిన టెండర్లపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది.

బిల్లులు ఇవ్వలేదని సిమెంటు నిలిపివేత

గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి రూ.1,000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో సామగ్రి సరఫరా చేసిన గుత్తేదార్లకు రూ.230 కోట్లు చెల్లించాల్సి ఉంది. బిల్లులు పెండింగ్‌ పెట్టినందున గుత్తేదారులు సామగ్రి సరఫరా నిలిపివేశారు. కొన్నిచోట్ల మరుగుదొడ్లు పూర్తయినా.. తలుపులు లేక వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. అదనపు తరగతి గదులకు సైతం తలుపులు, కిటికీల సమస్య నెలకొంది. కొన్నిచోట్ల బడుల్లో నిధులున్నా సిమెంట్, మరికొన్నిచోట్ల ఇసుక కొరత వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేలకుపైగా తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి. కొత్త గదుల నిర్మాణాల కోసమంటూ కొన్నిచోట్ల పాతవాటిని కూల్చేశారు. 

చేసిన పనుల్లోనూ అక్రమాలు

వైకాపా హయాంలో చేసిన పనుల్లోనూ అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మొదటి విడత బడులకు సరఫరా చేసిన ఆర్వోప్లాంట్లు సక్రమంగా పని చేయడం లేదు. కొన్నిచోట్ల నీటి క్యాన్లు తెప్పిస్తుండగా.. మరికొన్నిచోట్ల నల్లా నీళ్లనే విద్యార్థులు తాగాల్సి వస్తోంది. ఈ ఆర్వోప్లాంట్లకు మూడేళ్లు గ్యారంటీ ఉన్నా బిగించిన ఆరు నెలలకే సమస్యలు వచ్చాయి. ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ కొనుగోళ్ల టెండర్లను ఏపీ విద్య, సంక్షేమ మౌలికసదుపాయాల కల్పన సంస్థ(ఏపీఈడబ్ల్యుఎస్‌) నిర్వహించింది. ఆర్వోప్లాంట్ల విషయంలో సరైన నిబంధనలు పాటించకపోవడంతో రూ.కోట్లలో ప్రజాధనం ఖర్చు చేసినా ఉపయోగం లేకుండాపోయింది.

  • డ్యూయల్‌ డెస్క్‌ల సరఫరాలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మొదట 1.50లక్షల డ్యూయల్‌ డెస్క్‌లకు ఒప్పందం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వీటి కంటే 15% అదనంగా తీసుకోవచ్చు. దీనికి మించితే కొత్త టెండర్లు నిర్వహించాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా 1.50లక్షలకు ఒప్పందం చేసుకొని 2.49లక్షలు కొనుగోలు చేశారు. 
  • బగ్రీన్‌ చాక్‌పీస్‌ బోర్డుల టెండర్లలో మరో వింత చోటుచేసుకుంది. ఈ-టెండరులో ఎల్‌-1గా నిలిచిన వ్యక్తికి 15వేల బోర్డుల సరఫరా ఇచ్చి, ఒప్పంద గడువు ముగిసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఎల్‌-2గా నిలిచిన గుత్తేదారుకు 20 వేల బోర్డుల సరఫరా ఇచ్చారు. 
  • ఫ్యాన్లలోనూ నాణ్యత లోపించింది. గుత్తేదారుకు జరిమానా విధించాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని